మళ్లీ.. మనీ..!


  • రీపోలింగ్‌లోనూ కొనసాగిన ప్రలోభాల పర్వం
  • ఓటరుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500
  • మహిళా ఓటర్లకు చీర, జాకెట్‌
  • పురుషులకు షర్టు, ప్యాంటు
  • గుంటూరు పశ్చిమలో ప్రధాన పార్టీల పోటాపోటీ
వాళ్లు వెయ్యిచ్చారా..! అయితే ఇదిగో ఐదొందదలు అదనంగా తీసుకో..! అమ్మా ఈ చీర నీకు.. ఆయనకు షర్టు, ప్యాంటు.. ఇవేవో పండుగకు బంధువులు పెడుతున్న కానుకలనుకునేరు.. ఓట్ల పండుగ సందర్భంగా ప్రధాన పార్టీల నేతలు పోటీపడి పంచిన తాయిలాలివి.. పోలింగ్‌ అయినా రీపోలింగ్‌ అయినా ఒక్క ఓటూ వదిలే ప్రసక్తే లేదన్నట్టు నేతలు ప్రలోభాల పర్వానికి తెరలేపారు.. సోమవారం రీపోలింగ్‌ జరిగిన ఆ ఒక్క బూత్‌ పరిధిలోనే ఒక్కొక్కరు పాతిక లక్షలకు పైబడి ఖర్చు చేసినట్టు భోగట్టా..!
 
గుంటూరు (ఆంధ్రజ్యోతి): ముక్కోణపు పోటీలో ప్రతీ ఒక్క ఓటు కీలకమని భావించారో ఏమో రీపోలింగ్‌ సందర్భంగా ప్రధాన పార్టీల నాయకులు ఓటర్లకు భారీగా నజరానాలు అందజేశారు. నగదుతో పాటు దుస్తులు కూడా ఇచ్చి తమ నేతకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఓటర్లకు కానుకలు చేర్చారు. ప్రలోభాల విషయంలో పోటీ పడటంతో ఓటరు మూడు పార్టీల నేతలు ఇచ్చినవి తీసుకొని తనకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసినట్లు సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో సోమవారం జరిగిన రీపోలింగ్‌కు ఒక్కో అభ్యర్థి రూ. 25 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
 
ఈ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ముస్లిం మైనార్టీలు, ఎస్టీ ఓటర్లు అధికం. మొత్తం 1,396 మంది ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున ఈవీఎం మూడున్నర గంటల పాటు మొరాయించడంతో పోలింగ్‌ బాగా ఆలస్యమైంది. మరోవైపు వైసీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని టీడీపీ ఆందోళన వ్యక్తం చేయడంతో పోలింగ్‌ నిలిపివేసి రీపోలింగ్‌ నిర్వహించారు. ఎన్నికల రోజున 850కి పైగా ఓట్లు పోల్‌ అయిన తర్వాత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్‌ ముగిసి దాదాపుగా 25 రోజులు పైన కావడంతో అభ్యర్థులు బూత్‌ల వారీగా మెజార్టీలు, లోటు ఓట్లపై బేరీజు వేసుకున్నారు. ఎవరు గెలిచినా వెయ్యి నుంచి రెండు వేల లోపే మెజార్టీ ఉంటుందనే అభిప్రాయానికి పార్టీల నాయకులు వచ్చారు. ఈ నేపథ్యంలో రీపోలింగ్‌ సందర్భంగా ఎంత ఖర్చు అయినా వెనకడుగు వేయలేదు.
 
తొలుత ఒక పార్టీ తరఫున ఓటరుకు రూ. వెయ్యి చొప్పున నగదు పంపిణీ చేశారు. దీంతో మిగతా రెండు పార్టీల అభ్యర్థుల తరఫున వారి కార్యకర్తలు రంగంలోకి దిగారు. రూ. వెయ్యి నుంచి రూ. 1,500 వరకు నగదు ఇవ్వడంతో పాటు మహిళా ఓటర్లు అయితే రూ.750 విలువ చేసే చీర, జాకెట్‌, పురుషులకు రూ.500 విలువ చేసే షర్టు, ప్యాంట్‌ బిట్‌లు పంపిణీ చేశారు. ఇందుకోసం కార్యకర్తలు ఒక్కొక్కరు 10 నుంచి 15 ఇళ్లని పంచుకొన్నారు. ఎవ్వరికీ సందేహం కలగకుండా డబ్బు, దుస్తులు తీసుకొని ఓటరు ఇంటికి వెళ్లి చేతిలో పెట్టారు. పోలీసులు దాడులు చేసి ఇద్దరు వ్యక్తుల వద్ద రూ. 50 వేలు, రూ. 15 వేలు సీజ్‌ చేసినా అప్పటికే ఓటర్లకు అందాల్సినవి అందేశాయి. ఒక్కో అభ్యర్థి రమారమి రూ. 25 లక్షల వరకు రీపోలింగ్‌ సందర్భంగా ఖర్చు పెట్టినట్లు తెలిసింది. రీపోలింగ్‌ సందర్భంగా ఈ పోలింగ్‌ బూత్‌లో 1,053 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 583 మంది మహిళలు, 470 మంది పురుషులు ఉన్నారు. ఈ ఓట్లు ఎవరికి పోల్‌ అయి ఉంటాయనే దానిపై అభ్యర్థులు, స్థానిక నాయకులు ఇప్పటికే లెక్కల్లో తలమునకలయ్యారు. ప్రతీ ఒక్క ఓటు కీలకమని భావించిన నాయకులు, వారి అనుచరులు రీపోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా అక్కడి నుంచి వెనుదిరగలేదు. ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంకి వెళ్లేంత వరకు అక్కడే మకాం వేసి ప్రాధాన్యతని తెలిపారు. ఓటరు తీర్పు ఏ పార్టీకి అనేది ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంలో తేలిపోతుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *