మసూద్ అజర్ ఇస్లామాబాద్‌లోని రహస్య భవనంలో దాక్కున్నాడు?


న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఉగ్రవాది, మోస్టువాంటెడ్ అయిన జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌ పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్ నగరంలోని ఓ రహస్య భద్రతా గృహంలో దాక్కున్నాడని భారత నిఘావర్గాలు అందించిన ప్రభుత్వ అధికారిక పత్రంలో వెల్లడైంది. పాక్ అధికారిక ఐఎస్ఐ అధికారులే మసూద్ అజర్‌ను దాచి ఉంచారని భారత ఇంటలిజెన్స్ వర్గాల నివేదికలో తేలింది. గతంలో పాక్‌లోని బహవాల్‌పూర్ పట్టణంలోని మర్కజ్ సుభాన్ అల్లా గృహ నిర్బంధంలో ఉన్న మసూద్‌ను పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ దాడుల అనంతరం ఇస్లామాబాద్ నగరంలోని సురక్షిత భవనంలోకి మార్చారని భారత ఇంటలిజెన్స్ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. గతంలో భారత పార్లమెంటుపై దాడి నుంచి మొన్నటి పుల్వామా ఉగ్ర దాడి దాకా భారతదేశంలో పలు దాడులకు వ్యూహాలు రచించిన మౌలానా మసూద్‌ అజర్‌పై తాజాగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాద ముద్ర వేసిన నేపథ్యంలో మసూద్ ఎక్కడ ఉన్నాడనేది చర్చనీయాంశంగా మారింది.
 
జమ్మూ కశ్మీర్ లోయతోపాటు అప్ఝనిస్థాన్ దేశంలో జిహాది పేరిట ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న మసూద్ బాగోతాలపై రూపొందించిన నివేదికను భారత సర్కారు ఐక్యరాజ్యసమితికి అందజేసింది. జైషే మహ్మద్ కార్యకలాపాలను విస్తరించే బాధ్యతను మసూద్ సోదరుడు, కార్యనిర్వాహక కమాండర్ అయిన ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ కు మసూద్ అప్పగించాడని తేలింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జైషే మహ్మద్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుందని వెల్లడైంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *