మహా గట్టి బంధనమే!


  • ఎస్పీ-బీఎస్పీ ఓట్ల బదిలీ జరిగితే హోరాహోరే..
  • బీజేపీ ఓట్లకు కాంగ్రెస్‌ అభ్యర్థుల కన్నం!
  • యూపీలో రాహుల్‌ సేన ఐదారు గెలిచే అవకాశం
  • మోదీని అబద్దాల కోరుగా భావిస్తున్న ప్రజలు
  • తిమ్మిని బమ్మిని చేసైనా గెలుస్తాడనే భావన
  • ఎస్పీ-బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ విఫలమైతే
  • పలు చోట్ల కాంగ్రెస్‌, బీజేపీలకు లబ్ధి
  • బీజేపీ అభ్యర్థులంతా చోటామోటా నేతలే
  • మోదీ వేవ్‌ లేకుంటే ఓటమి ఖాయం
(లఖ్‌నవూ నుంచి ఎ.కృష్ణారావు):
ఐదేళ్ల క్రితం కేంద్రంలో బీజేపీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్‌లో కాషాయ దళానికి పరిస్థితి అంత బాగా లేదు. బీజేపీ చిత్తవుతుందని ఎవరూ అనుకోకున్నా నల్లేరుపై నడక మాత్రం కాదని నిశ్చితంగా చెబుతున్నారు. ఇక్కడ ఎస్పీ-బీఎస్పీ మహాగట్‌బంధన్‌ ఒకపక్క, ప్రియాంక నేతృత్వంలోని కాంగ్రెస్‌ మరోపక్క బలం పుంజుకొని అధికార పార్టీని సవాలు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన 71 సీట్లలో బీజేపీ ఎన్ని నిలబెట్టుకుంటుందనే అంశం లఖ్‌నవ్‌లో అన్ని వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీలోని రాజకీయ పరిశీలకులు ఈసారి బీజేపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని అంటున్నారు. లఖ్‌నవ్‌లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఆంధ్రజ్యోతి ప్రతినిధి పర్యటించి, వివిధ వర్గాల మనోభావాలను సేకరిస్తున్నపుడు బీజేపీ ఒక్కో సీటు గెలిచేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమయింది. పట్టణ ప్రాంతాల్లో మోదీ అనుకూలంగా చాలామంది మాట్లాడుతున్నప్పటికీ 2014తో పోలిస్తే మోదీ వ్యతిరేకత కూడా వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
చివరి మూడు దశలే కీలకం
యూపీలో మూడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉన్న ఒక సీనియర్‌ పాత్రికేయుడిని కలిసినపుడు మొదటి నాలుగు దశల్లో 39 సీట్లకు ఎన్నికలు జరగ్గా, బీజేపీ కేవలం 15 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మిగతా మూడు దశల్లోని 41 స్థానాల్లో కూడా బీజేపీకి ఎస్పీ, బీఎస్పీ మహాకూటమి ఒకవైపు, కాంగ్రెస్‌ మరోవైపు గట్టి పోటీని ఇవ్వనున్నట్లు తెలిపారు. మే 6 నుంచి 19 వరకు జరిగే చివరి మూడు దశలే బీజేపీకి కీలకమని విశ్లేషకులు అంటున్నారు. మే ఆరవ తేదీన 14 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుండగా, సీతాపూర్‌, లక్నో, బండా, ఫతేపూర్‌, కౌశాంబీ, కైసర్‌ గంజ్‌, గోండాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో రాయబరేలీ, అమేథీ, బహ్రయిచ్‌, ధరోరాలో కాంగ్రెస్‌ అభ్యర్థులు సోనియాగాంఽధీ, రాహుల్‌ గాంధీ, సావిత్రీ భాయి పూలే, జతిన్‌ ప్రసాద గెలుపుబాటలో ఉన్నారు.
 
మోహన్‌లాల్‌ గంజ్‌లో బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ కె చౌదరి, ఫైజాబాద్‌, బారాబంకీలో ఆనందసేన్‌ యాదవ్‌, రాంసాగర్‌ రావత్‌లు ముందంజలో ఉన్నారు. బారాబంకీలో కాంగ్రెస్‌ మాజీ మంత్రి పిఎల్‌ పునియా కుమారుడు తనూజ్‌ పునియా, ఎస్పీ అభ్యర్థి రాంసాగర్‌ రావత్‌ల మధ్య ముస్లింలు ఎటు మొగ్గుతారన్న విషయంపై స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. లక్నో, బారాబంకి నుంచి ఫైజాబాద్‌ వరకూ 2014లో కనపడ్డ మోదీ అనుకూల వాతావరణం కనపడడం లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎస్పీ-బీస్పీ కూటమి ఓటర్లు సంఘటితమై బీజేపీ అభ్యర్థులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ప్రియాంక వల్ల అనేక చోట్ల బీజేపీ ఓట్లను కాంగ్రెస్‌ చీల్చే పరిస్థితి కనపడుతోంది. కాంగ్రెస్‌ 6 నుంచి 8 సీట్ల వరకు గెలుచుకునే అవకాశాలున్నాయని, మిగతా 74 సీట్లలో మహాకూటమి, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయని ఈ వర్గాలు అంటున్నాయి.
 
వాగ్దాన భంగం
2014తో పోలిస్తే 2019లో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉన్నది? ఈ ప్రశ్నకు లఖ్‌నవ్‌లోని హజ్రత్‌ గంజ్‌లో గాంఽధీ ఆశ్రమ్‌ నిర్వాహకులు పాండే, శత్రుఘన్‌ దుబే స్పష్టంగా సమాధానమిచ్చారు. 2014లో తామంతా మోదీకి మద్దతునిచ్చిన వారమేనన్నారు. ఆయన వాగ్దానాలేవీ నెరవేర్చలేదని చెప్పారు. మోదీ అబద్దాలు మాట్లాడతారన్న విష.యం అందరికీ అర్థమవుతోందన్నారు. మోదీకి ఖాదీ విలువ తెలియదని, బ్రిటిష్‌ వారు కూడా ఖాదీని పన్ను నుంచి మినహాయిస్తే మోదీ ఖాదీకి పన్ను వేశారని, మోదీ తిరిగి అధికారంలోకి వస్తే ఖాదీ పరిశ్రమ మూత పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యోగి అదిత్యనాథ్‌ ప్రభుత్వం పనితీరుపై కూడా వారు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన హయాంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా బ్రాహ్మణులకు విలువ ఉండేదని, యోగి ప్రభుత్వంలో బ్రాహ్మణులకు విలువ లేదన్నారు. ఆయన మంత్రివర్గంలో సగం మంది నేరస్థులేనన్నారు.
 
ఈవీఎంలపై అనుమానం
ఆంధ్రప్రదేశ్‌ తరహాలో యూపీలోనూ బీజేపీకి అంతగా బలంలేని చోట ఈవీఎంలు మొదటి మూడు గంటలు పని చేయలేదని ప్రముఖ పాత్రికేయురాలు సునీతా ఆరన్‌ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని దశల పోలింగ్‌లోనూ ఈవీఎంలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈవీఎంల్లో ఎస్పీకి ఓటేస్తే బీజేపీకి పడుతుందనే అనుమానాలు తమకున్నాయని లక్నోలో చికన్‌ అల్లిక దుస్తుల వ్యాపారి అంజాద్‌ చెప్పారు. తిమ్మిని బమ్మి చేసైనా మోదీ అధికారంలోకి వస్తాడనే భయం ఉందన్నారు.
 
సగం కూడా రాకపోవచ్చు?
యూపీలోలో బీజేపీ గతంలో గెలిచిన సీట్లలో సగానికన్నా ఎక్కువ ఆ పార్టీకి రాకపోవచ్చని, అంతకన్నా తగ్గినా ఆశ్చర్యం లేదని గోమతీనగర్‌లో నివసిస్తున్న ప్రముఖ హిందీ కవి నరేష్‌ సక్సేనా అన్నారు. ప్రజలు మోదీ అబద్దాలను అర్థం చేసుకుంటున్నారని, వారు అంత తెలివి తక్కువ వారు కారని చెప్పారు. ప్రజలు తనకు వ్యతిరేకంగా మారుతున్నారన్న విషయం మోదీ అర్థం చేసుకున్నారని, అందుకే వారణాసిలో మాజీ సైనికుడు తేజ్‌ బహదూర్‌ను పోటీ చేయకుండా అడ్డుకున్నారని, ఎన్నికల కమిషన్‌తో సహా మొత్తం పరిపాలనా యంత్రాంగం మోదీకి అనుకూలంగా పని చేస్తున్నదని చెప్పారు. తేజ్‌ బహదూర్‌ పోటీ చేస్తే మిగతా పార్టీలు ఆయనకు ఏకగ్రీవంగా మద్దతునిస్తాయని మోదీ కుట్ర పూరితంగా పని చేశారని ఆరోపించారు. యూపీలో మోదీ దెబ్బతినడం ఖాయమన్నారు. కాగా మోదీ అధికారంలో ఉంటే సురక్షితమైన హస్తాల్లో ఉన్నట్లు భావించే వారున్నారని సీనియర్‌ పాత్రికేయుడు సుభాషిష్‌ మిత్రా అన్నారు. బీజేపీ 35 నుంచి 50 సీట్ల వరకు గెలుచుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. మాయావతి ఆదేశిస్తే బీఎస్పీ ఓట్లు ఎస్పీకి బదిలీ అవుతాయని, ఎస్పీ ఓట్లు బీఎస్పీకి బదిలీ అవుతాయని గ్యారెంటీ ఇవ్వలేమని, దీనివల్ల కూడా బీజేపీకి లాభం చేకూరవచ్చని చెప్పారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *