మాయ, అఖిలేశ్‌ ప్రభుత్వాలే నయం


చికన్‌ దుస్తుల వ్యాపారం మోదీ వల్ల పూర్తిగా పడిపోయిందని, జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో కనీవినీ ఎరుగని నష్టానికి గురయ్యామని, ఆ కష్టాలు తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయని అంజాద్‌ చెప్పారు. చికన్‌ దుస్తుల తయారీ కార్మికుల గోడు మరో రకంగా ఉంది. రోజుకు 12 గంటలు పనిచేస్తే కానీ రూ.50 కూలీ రాదని, దుస్తులకు జాలీలు కుడితే ఒకో జాలీకి రూ.3-5 ఇస్తారని చెప్పారు. నోట్ల రద్దు సమయంలో బాకీపడ్డ సొమ్ము యజమానులు ఇంతవరకు చెల్లించలేదన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి చెందిన లఖ్‌నవ్‌ చికన్‌ దుస్తుల పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ఏమీ చేయలేదని వాపోయారు. జీఎస్టీ వల్ల తమ వ్యాపారం బాగా దెబ్బతిన్నదని వంట సామాన్లు అమ్మే బర్తన్‌ బజార్‌ వ్యాపారులు చెప్పారు. పాత లఖ్‌నవ్‌ను ఇప్పుడెవరూ పట్టించుకోనట్లు కనిపిస్తోంది. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ ఉన్నా ఎవరూ క్రమబద్దీకరించే ప్రయత్నం చేయడం లేదు. యోగి ప్రభుత్వం కన్నా మాయావతి, అఖిలేశ్‌ ప్రభుత్వాలే మెరుగ్గా కనిపిస్తున్నాయని ఆటో డ్రైవర్‌ నకుల్‌ చెప్పాడు. రెండు లక్షలు వాయిదాల్లో చె ల్లిస్తే ఇల్లు ఇస్తారని చెప్పారని, రెండేళ్లయినా ఇంతవరకు ఇల్లు వచ్చినా దాఖలాలు కనపడలేదని వాపోయాడు. తన భార్య తన కూతురి పేరున సుకన్యా యోజన కింద బ్యాంకు ఖాతా తెరిచిందని, ఇంతవరకూ డబ్బు పడలేదని చెప్పాడు.

నాయకత్వ లోపం
బీజేపీ, బీఎస్పీల్లో బలహీన నాయకులు ఎక్కువగా ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. గతంలో మోదీ ప్రభంజనంలో చిన్నాచితకా నేతలంతా గెలిచారని, ఇప్పుడు మోదీ ప్రభంజనం లేదు కనుక వారు గెలవడం అనుమానమేనని అంటున్నారు. బీజేపీలో ఎదిగిన నాయకులు తక్కువగా ఉన్నారని, జయప్రదతో సహా అనేకమందిని ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. బీఎస్పీలోనూ అభ్యర్థులందర్నీ మాయావతి ఎంపిక చేశారని, వారికి వ్యక్తిగతంగా గుర్తింపు లేదని అంటున్నారు.
 
రాజ్‌నాథ్‌ సింగ్‌ గెలుస్తారా?
లఖ్‌నవ్‌ నుంచి పోటీ చేస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఎదురు లేదని, అయితే గతంలో కంటే ఓట్లు తగ్గిపోతాయని స్థానికులు అంటున్నారు. రాజ్‌నాథ్‌ గెలిస్తే ఏకు మేకైపోతారని, ఆయన గెలవకూడదని మోదీ భావిస్తున్నట్లు విశ్లేషిస్తున్న వారు కూడా లఖ్‌నవ్‌లో ఉన్నారు. లఖ్‌నవ్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రచారానికి మోదీ రాకపోవడం ఈ అనుమానాలకు తావిచ్చింది. లఖ్‌నవ్‌లో ఇప్పటి వరకు ఎస్పీ, బీఎస్పీలు గెలిచిన దాఖలాలు లేవు. స్వాతంత్య్ర కాలం నుంచి 1991 వరకు ఇక్కడ కాంగ్రెస్‌ గెలుస్తూవ చ్చింది. వాజపేయి 1991, 96, 98, 2004 ఎన్నికల్లో గెలిచారు. 2009లో ఆయన శిష్యుడు లాల్‌జీ టాండన్‌, 2014లో రాజ్‌నాథ్‌ సింగ్‌ గెలిచారు. చాపకింద నీరులాగా రాజ్‌నాథ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఓట్లు పడే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ రచయిత నరేష్‌ సక్సేనా అన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *