మినీ గోకులాలకు నాధుల గ్రహణం


  • ఎప్పుడొస్తాయో తెలియదంటున్న అధికారులు
  • అప్పులు చేసి నిర్మించుకున్న రైతులు
  • సబ్సిడీ వడ్డీలకు సరిపోతుందని ఆవేదన
పశువులను సంరక్షించేందుకు రైతులు నిర్మించుకోవచ్చని 90 శాతం ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆర్భాటంగా చెప్పి… రైతుల చేత డబ్బులు ఖర్చు పెట్టించి నిర్మింప జేసిన మినీ గోకు లాలకు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. ఒకవైపు ఎన్నికల కోడ్‌, మరోవైపు ఉపాధి హామీ నిధుల విడుదల్లో తీవ్ర జాప్యం కలిపి రైతులను కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి.
 
 
గుంటూరు: కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పథకం కింద రైతులకు పశువులను ఉంచుకునే నిమిత్తం మినీ గోకులాల పేరుతో షెడ్లను నిర్మించే పథకం ప్రవేశపెట్టింది. గతంలో తాటాకుల తో వేసుకునే పాకలతో ప్రమాదాలు జరిగి నప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రన్న ఉద్దేశంతో వీటికి శాశ్వతషెడ్లు నిర్మిస్తే పశుపోషణకు చేయూతనిచ్చినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనిద్వారా రెండు, నాలుగు, ఆరు గేదెలు ఉంచేందుకు షెడ్లను వివిధ సైజుల్లో రూపొందించు కోవచ్చని అవకాశం ఇచ్చింది. దీనిలో పదిశాతం రైతులు పెట్టుకుంటే మిగిలిన 90 శాతం కేంద్రం నిధులు ఇచ్చే విధంగా అవకాశం ఉంది. జిల్లాలో పశు సంవర్ధకశాఖ అధికారుల ప్రకటన మేరకు 1231 మంది రైతులు మినీ గోకులాలను నిర్మించుకునేందుకు ముందు కొచ్చారు. వీరిలో రెండు గేదెలకు 127మంది, నాలుగు గేదెలకు 237 మంది, ఆరు గేదెలకు 867 మంది ముందుకువచ్చారు. వీరందరికీ నిర్మించుకునే వెసులుబాటు కల్పించినా… నిధుల సంగతి మాత్రం ఊసెత్తడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో కనీసం 20 శాతం మంది రైతులు పూర్తిస్థాయి షెడ్లను నిర్మించుకున్నట్లు అనధికారిక సమాచారం. మిగిలిన వారందరూ పునాదుల స్థాయిలో కొందరు, 80 శాతం పనులు పూర్తిచేసి మరికొందరు పనులు నిలిపి వేశారు. రైతులు ఇప్పటి వరకే సుమారు రూ. 20 కోట్ల మేర జిల్లాలో వీటిపై వెచ్చించారు. ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ నిధుల విడుదల మాత్రం ఎప్పుడో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అధికారులది.
 
పెరిగిన రైతు వాటా
ఆరునెలల క్రితం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు పది శాతం రైతులు చెల్లిస్తే 90 శాతం కేంద్రం ఇచ్చే విధంగా నిబంధనలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మినీ గోకుల పథకానికి విశేష ఆదరణ రావడంతో కేంద్రం రైతుల వాటాను పెంచింది. 30 శాతం రైతులు చెల్లిస్తే 70 శాతం మాత్రమే ప్రస్తుతం కేంద్రం ఇచ్చే విధంగా కొత్త ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి నిర్మించుకున్న మినీ గోకులాలకు 90 శాతం సబ్సిడీ ఉంటుంది. ఇకపై అనుమతులు ఇచ్చేవాటికి 70శాతం మాత్రమే కేంద్రం ఇస్తుంది.
 
రైతులు ఇబ్బందులు
ఇప్పటికే రైతులలో 90శాతం మంది అప్పుల తో షెడ్లను పూర్తి చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా నిధులు రాకపోవడంతో కేంద్రం ఇచ్చే సబ్సిడీ వడ్డీలకే పోతుందేమోనన్న అనుమా నాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆరు నెలలు గడిచిందని, మరో ఆరు నెలలు గడిస్తే కేంద్రం ఇచ్చిన ప్రయోజనం కూడా ఉండదని ఆవేదన చెందుతున్నారు. అయితే అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికలు పంపుతున్నామని, నిధులు రాగానే నేరుగా రైతుల అకౌంట్లలో జమచేస్తామని చెబుతున్నారు.
 
రాజకీయ కోణం ఉన్నదా..?
అయితే అనేక మందిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే… ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సరిగా లేకపోవడంతో అను మానాలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో రైతులు మాత్రమే దీనిని ఎక్కువగా ఉపయోగించు కునేందుకు ముందుకు వచ్చారు. దీంతో కేంద్రం నిధుల విడుదలలో కొర్రీలు వేస్తుందేమోనన్న అనుమానాలు కూడా అనేక మందిని వేధిస్తున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *