మిర్చియార్డుకి కన్నం!


  • ఎన్నికల కోడ్‌తో కొరవడిన పర్యవేక్షణ
  • పక్కదారి పట్టిన ఆదాయం
  • కొంతమంది అధికారుల ఽఅక్రమార్జన
  • మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదుల వెల్లువ
గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్‌ కారణంగా పాలకవర్గం అజమాయిషి లేకపోవడంతో మిర్చియార్డులో కొంతమంది అధికారులు, ఉద్యోగులు అందినకాడికి వెనకేసుకొన్నారు. ఇంచుమించు నెలన్నరకు పైగా ఈ తంతు కొనసాగింది. జీరో, కటింగ్‌, బిల్‌ టూ బిల్‌, తాత్కాలిక లీజులు, గొర్రెల మండి సెస్సు. ఇలా… కాదేది అనర్హం అన్నట్లుగా దోపిడి కొనసాగింది. ఈ వ్యవహారంలో పాలకవర్గంలోని ఇద్దరు, ముగ్గురికి వాటాలు అందినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భాగోతంపై ఇప్పటికే సచివాలయంలో మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు వాటిపై దృష్టి సారించారు. దీంతో ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం యార్డు అధికారవర్గాలకు పట్టుకొన్నది.
 
ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందో ఆ రోజు నుంచి జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాటిని చూపించి అసలు పాలకవర్గాన్ని యార్డుకే రావొద్దని మౌఖికంగా చెప్పారు… మరోవైపు పాలకవర్గంలో ఉన్న సభ్యులంతా తెలుగుదేశం పార్టీ నాయకులు కావడంతో వారంతా తమ నేతల తరుపున ఎన్నికల ప్రచారాల్లో బిజీ అయిపోయి యార్డు ముఖం చూడలేదు. ఇదే అదనుగా కొంతమంది సూపర్‌వైజర్లు అక్రమార్జనకు తలుపులు బార్లా తీశారు. లైసెన్సులు ఉండి నగదు లేక వ్యాపారం చేయలేని వారి పేర్లతో మిర్చి కొనుగోళ్లు జరిపారు. ఇందుకు టిక్కీకి రూ.2 చొప్పున వసూలు చేశారు. ఒక్కో ఫరం పేరు మీద నెలకు 5 లక్షల టిక్కీలకు పైగానే కొనుగోలు చేసినట్లు సమాచారం. యార్డులో ఒక వ్యక్తి వద్ద ఇలా 10 ఫరంలు ఉండగా వాటి ద్వారా బిల్‌ టూ బిల్‌ బిజినెస్‌ మూడు పువ్వులు ఆరుకాయలు వలే కొనసాగించినట్లు మార్కెటింగ్‌ శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి.
 
కటింగ్‌ బిజినెస్‌ని కూడా కొంతమంది ప్రోత్సహించారు. యార్డులో ఈ ఏడాది సీజన్‌లో ఎక్కడా మిర్చి ధర పతనం కాలేదు. అయినప్పటికీ బిల్లుల్లో మాత్రం తక్కువ చూపించారు. ఇలా ధర కోత పెట్టడం వలన మార్కెటింగ్‌ ఫీజు రూపంలో మిర్చియార్డు ఆదాయం కోల్పోయింది. మరోవైపు అందుకు సహకరించిన అధికారులకు ఆయా వ్యాపారస్థుల నుంచి దండిగా కాసులు ముట్టాయి. గొర్రెల మండి ద్వారా గతంలో రూ.50 వేల ఆదాయం వచ్చేది. అయితే అది పూర్తిగా పడిపోయింది. వారానికి రూ.10 వేలకు మించి వసూలు కాని పరిస్థితికి వచ్చింది. ఈ వ్యవహారంలో ఒక పాలకవర్గ సభ్యుడి పాత్ర పైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యార్డు నుంచి సరుకు బయటకు వెళ్లే గేట్ల వద్ద కూడా కొంతమంది సెక్యూరిటీ గార్డులు జీరో బిజినెస్‌ లారీలను బయటకు పంపించేసి అందుకు ప్రతిఫలంగా నిత్యం కరెన్సీ నోట్లని అందుకొన్నారు. వీటన్నింటిపై మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు అధికారులు, ఉద్యోగుల పాత్రపై దృష్టి సారించారు. మరోవైపు కొంతమంది పాలకవర్గ సభ్యులు ఒక బృందంగా ఏర్పడి మూడు రోజుల క్రితం అధికారులను కూడా నిలదీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొంటారోనన్న ఉత్కంఠ యార్డులో నెలకొన్నది.
 
నేటి నుంచి యార్డుకు వేసవి సెలవులు
మిర్చియార్డుకు శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వ్యాపారస్థులు, హమాలీల విజ్ఞప్తి మేరకు అధికారులు, పాలకవర్గ సభ్యులు కలిసి చర్చించుకొని ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు. తిరిగి జూన్‌ 10వ తేదీన మిర్చియార్డు తలుపులు తెరుచుకొంటాయని యార్డు ఛైర్మన్‌ వెన్నా సాంబశివారెడ్డి తెలిపారు. అప్పటివరకు రైతులు ఎవ్వరూ మిర్చి టిక్కీలను యార్డుకు తీసుకురావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సెలవులకు ముందు రోజు కావడంతో గురువారం యార్డులో పెద్దఎత్తున లావాదేవీలు జరిగాయి. లక్షా మూడు వేలకు పైగా టిక్కీలను వ్యాపారస్థులు కొనుగోలు చేశారు. ట్రేడింగ్‌ జరగగా యార్డులో మిగిలిపోయిన 19 వేల టిక్కీలను కోల్డ్‌స్టోరేజ్‌లకు తరలించుకోవాల్సిందిగా అఽధికారవర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. ట్రేడింగ్‌కు మాత్రమే సెలవులని, యార్డు పరిపాలన, కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని తెలియజేశాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *