మీ హద్దుల్లో ఉండండి!


  • పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌..
  • కిరణ్‌ బేదీకి మద్రాస్‌ హైకోర్టులో షాక్‌
  • కేంద్రం ఇచ్చిన ప్రత్యేక అధికారాలు రద్దు
చెన్నై, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న ఐపీఎస్‌ మాజీ అధికారి కిరణ్‌ బేదీకి మద్రాస్‌ హైకోర్టు మదురై బెంచ్‌లో ఊహించని పరిణామం ఎదురైంది. ‘గవర్నర్‌గా మీ హద్దులు తెలుసుకుని, వాటిలో ఉండండి’ అంటూ న్యాయస్థానం కిరణ్‌ బేదీకి సూచించింది. పుదుచ్చేరిలో నారాయణ స్వామి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించిన తీరుపై కోర్టు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. పుదుచేర్చి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేదీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రత్యేక అధికారాలను రద్దు చేస్తూ, ముఖ్యమంత్రి అధికారాల్లో జోక్యం చేసుకోవడానికి వీలులేదంటూ హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ స్పష్టమైన తీర్పు వెలువరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన అధికారాన్ని గవర్నర్‌ కిరణ్‌ బేదీ దుర్వినియోగం చేసి సీఎం నారాయణస్వామి అధికారుల్లో జోక్యం చేసుకుని, పాలనను స్తంభింపజేస్తున్నారని ఆరోపిస్తూ పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్‌ హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ రోజువారీ పాలనా వ్యవహారాలను పరిశీలించే విధంగా కిరణ్‌ బేదీకి 2017లో కేంద్ర హోం శాఖ కల్పించిన ప్రత్యేక అధికారులను రద్దు చేయాలని కోరారు.
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ మహదేవన్‌.. పుదుచ్చేరిలో సీఎం అధికారాల్లోనూ, రోజువారీ పాలనలోనూ జోక్యం చేసుకునే అధికారం కిరణ్‌బేదీకి లేదని, అంతేకాకుండా ప్రభుత్వ ఫైళ్లను పరిశీలించి అధికారులకు నేరుగా ఆదేశాలిచ్చే అధికారం కూడా లేదని తీర్పు వెలువరించారు. అదేవిధంగా కేంద్రపాలిత రాష్ట్రాలలో ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకునేలా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఉత్తర్వును కూడా రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
 
ఇది ప్రజా విజయం: సీఎం.. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉంటాయని హైకోర్టు తీర్పు మరోమారు రుజువు చేసిందని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *