ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదుకు ఈసీ ఆదేశం


ముంబై : ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ దేవరాపై మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది. జైన మతస్థులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని శుక్రవారం పోలీసులను ఆదేశించింది.
 
మిలింద్ దేవరా ఈ నెల 4న ఝవేరీ బజార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. జైన మతస్థుల మనోభావాలను శివ సేన గాయపరుస్తోందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేనకు ఓటు వేయకుండా గట్టి గుణపాఠం చెప్పాలని జైనులను కోరారు. శివసేన అల్ప సంఖ్యాకులకు (మైనారిటీలకు) వ్యతిరేకమని ఆరోపించారు. కొన్నేళ్ళ క్రితం పర్యుషాన ఉపవాస దీక్షల సందర్భం గా జైన దేవాలయాల బయట మాంసాన్ని వండి మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ‘‘మీ ఓట్లతో వారికి గుణపాఠం చెప్పాలి’’ అన్నారు.
 
మిలింద్ దేవరా వ్యాఖ్యలపై శివసేన అభ్యర్థి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మిలింద్ మతపరంగా సున్నితమైన, తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ దర్యాప్తు జరిపింది. అనంతరం మిలింద్ దేవరాపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
 
మహారాష్ట్రలో 48 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నెల 11 నుంచి 29 వరకు నాలుగు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *