ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా


  • ప్రయాణికురాలిపై ఓలా డ్రైవర్‌ వేధింపులు.. అరెస్టు.. జైలుకు తరలింపు
బెంగళూరు, ఏప్రిల్‌ 25: ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడిన ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ కటకటాల పాలయ్యాడు. బాధితురాలు(22) బెంగళూరులో ఇంజనీరుగా పనిచేస్తున్నారు. నగవర ప్రాంతంలో పేయింగ్‌ గెస్టుగా ఉంటున్నారు. వారాంతంలో అక్కడికి 20కిలోమీటర్ల దూరంలోని కోరమంగళ ప్రాంతంలో నివసిస్తున్న సోదరితో గడిపేందుకు ఈనెల 22న ఓలా క్యాబ్‌ను ఆశ్రయించారు. కోల్‌కతాలో ఉంటున్న ఆమె తండ్రి క్యాబ్‌ను బుక్‌ చేశారు. క్యాబ్‌లో మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. కారు వేగం పెంచాలని బాధితురాలితోపాటు ఇతర ప్రయాణికులూ డ్రైవర్‌ను కోరడంతో స్పీడ్‌లిమిట్‌ దాటి చాలా ర్యాష్‌గా నడిపాడు.
 
దీంతో సక్రమంగా నడపాలని హెచ్చరించారు. మిగిలిన ప్రయాణికులు వారి గమ్యస్థానాలు వచ్చాక దిగిపోయారు. ఒంటరిగా మిగిలిన బాధితురాలిపై డ్రైవర్‌ వేధింపులకు పాల్పడ్డాడు. గమ్యస్థానానికి చేరాక రూ.200 ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ముందే రూ.70చెల్లించానని, మిగిలిన డబ్బు తన తండ్రి ఓలాకు చెల్లించాడని బాధితురాలు చెప్పినా వినకుండా డోర్లు లాక్‌ చేసి, దిగనీయలేదు. బాధితురాలు తండ్రికి ఫోన్‌చేసి ఇవ్వగా, ‘నీకూతుర్ని నరికిపారేస్తా! ఎక్కడికో తీసుకెళ్లి వదిలేస్తా!’ అంటూ బెదిరించాడు. ఫోన్‌ ఇవ్వాలని బాధితురాలు అడిగినా, తిరిగి ఇవ్వలేదు. బాధితురాలు సాయం కోసం అరిచినా ప్రయోజనం లేకపోయింది. చేసేది లేక అతనికి రూ.500 చెల్లించింది. దీంతో ఫోన్‌ వెనక్కి ఇవ్వడంతోపాటు, ఆమెను వెళ్లనిచ్చాడు.
 
‘మళ్లీ నీవు కారు నడపకుండా చేస్తా’ అంటూ బాధితురాలు అక్కడి నుంచి వెళ్లిపోతుండగా, ‘నీవు ఎక్కడుంటావో తెలుసు.. నిన్ను వదలను. నీ అంతు చూస్తా. ముక్కలుముక్కలుగా నరికి పారేస్తా’ అని బెదిరించాడు. బాధితురాలు హాళి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, డ్రైవర్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఓలా యాజమాన్యానికి ఫిర్యాదుచేయగా, ఆ డ్రైవర్‌ను శిక్షణకు పంపిస్తామని, విధులకు దూరం పెడతామని సమాధానమిచ్చారంటూ బాధితురాలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *