ముగిసిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌


  •  నేడు ప్రాథమిక ‘కీ’ విడుదల
  •  తుది రోజు ఇంజనీరింగ్‌కు 94.80% హాజరు
  •  ఏపీలో 95.42%.. తెలంగాణలో 90.61%
అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఏపీ-ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. మొత్తం 7 సెషన్లుగా జరిగిన ఈ పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. బుధవారం వీటికి సంబంధించిన ప్రాథమిక ‘కీ’ విడుదల కానుంది. తుదిరోజు జరిగిన పరీక్షకు 94.8% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 95.42% మంది, తెలంగాణలో 90.61% మంది పరీక్ష రాశారు. కాగా, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి సెషన్ల వారీగా మాస్టర్‌ ప్రశ్నపత్రాలు, వాటి ప్రాథమిక ’కీ’లను బుధవారం మధ్యాహ్నం ఎంసెట్‌ వెబ్‌సైట్లో పొందుపరుస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. విద్యార్థి మెయిల్‌ ఐడీకి సంబంధిత ప్రశ్నపత్రం పంపుతామని చెప్పారు. దీంతో పాటు ప్రతి ప్రశ్నకు కుడి పక్కన విద్యార్థి ఎంపిక చేసిన ఆప్షన్‌ ఇస్తారు. ప్రశ్నలోని 4 ఆప్షన్లలోసరైన ఆప్షన్‌ గ్రీన్‌ మార్క్‌గాను, మిగిలిన 3 తప్పు ఆప్షన్లు రెడ్‌ మార్కులో ఉంటాయన్నారు. ప్రాథమిక ’కీ’పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26 సాయంత్రం 5 గంటలలోగా apeam-cet2019objections@gmail.com మెయిల్‌ ఐడీకి అభ్యంతరాలను నిర్దేశించిన ఫార్మాట్‌లో పంపాలని సూచించారు.
 
తొలిరోజు అగ్రికల్చర్‌కు 93.19% హాజరు: అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్ష మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. మొదటి సెషన్‌కు 27,364(93.19%) మంది హాజరయ్యారు. బుధవారం జరగనున్న రెండో సెషన్‌ పరీక్షకు ఏపీలో 86 పరీక్షా కేంద్రాల్లో 24,493 మంది హాజరుకానున్నారని, హైదరాబాద్‌లో 6 పరీక్షా కేంద్రాల్లో 5,523 మంది రాయనున్నారని కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *