ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటుకు బ్రేక్‌


చెన్నై: అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు శాసనసభ్యులు స్పీకర్‌ ధనపాల్‌ జారీ చేసిన నోటీసుపై తదుపరి చర్యలకు తావులేకుండా సుప్రీంకోర్టు సోమవారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాలలోపున స్పీకర్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ నోటీసు కూడా జారీ చేసింది. గత పది నెలలుగా అన్నాడీఎంకేకు చెందిన అరంతాంగి శాసనసభ్యుడు రత్నసభాపతి, విరుదాచలం శాసనసభ్యుడు కళైసెల్వన్‌, కల్లకురిచ్చి శాసనసభ్యుడు ప్రభు అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు.
 
ఆ నేపథ్యంలో అన్నాడీఎంకే విప్‌ రాజేంద్రన్‌ పది రోజులకు ముందు సచివాలయంలో స్పీకర్‌ ధనపాల్‌ను కలుసుకుని పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ముగ్గురు శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రతిపాదనపత్రాలు అందజేశారు. అధికార పార్టీ విప్‌ ప్రతిపాదన మేరకు స్పీకర్‌ ధనపాల్‌ గత మంగళవారం ముగ్గురు శాసనసభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల ఏడో తేదీలోగా తన ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీసులో ఆదేశించారు. ఆ నోటీసు జారీ చేసిన అరగంటలోపే ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే స్పీకర్‌ ధనపాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ శాసనసభ కార్యదర్శి శీనివాసన్‌కు నోటీసును అందజేసింది. ఆ పరిస్థితులలో అరంతాంగి, విరుదాచలం శాసనసభ్యులు రత్న సభాపతి, కళైసెల్వన్‌లు తామింకా అన్నాడీఎంకే పార్టీలోనే కొనసాగుతున్నామని, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం ఇటీవలే తమ వర్గాన్ని రాజకీయ పార్టీగా గుర్తించాలంటూ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నదని, కనుక తమపై పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ మాత్రం వర్తించదని ప్రకటించారు.
 
కల్లకురిచ్చి శాసనసభ్యుడు ప్రభు మాత్రం స్పీకర్‌ను ఈ నెల ఏడున కలుసుకుని సంజాయిషీ ఇస్తానని తెలిపారు. ముగ్గురు శాసనసభ్యులు స్పీకర్‌ నోటీసులకు తలొగ్గి సంజాయిషీ ఇచ్చేందుకు వస్తారని ఆశించిన అధికార అన్నాడీఎంకే పార్టీకి నిరాశే మిగిలింది. గత శుక్రవారం వున్నట్టుండి అరంతాంగి, విరుదాచలం అన్నాడీఎంకే శాసనసభ్యులు రత్నసభాపతి, కళైసెల్వన్‌లు స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రకటించి తీవ్ర సంచలనం కలిగించారు. ఆ మేరకు తమను అనర్హులుగా ప్రకటించే దిశగా స్పీకర్‌ జారీ చేసిన నోటీసును వ్యతిరేకిస్తూ రత్నసభాపతి, కళైసెల్వన్‌ గత శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కూడా స్పీకర్‌ ధనపాల్‌పై తాము అవిశ్వాసన తీర్మానం ప్రతిపాదించనుండటంతో ముగ్గురు అన్నాడీఎంకే శాసనసభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.
 
ఈ రెండు పిటిషన్లను అత్యవసర కేసులుగా పరిగణించి విచారణ జరపాలన్న కోరికను సుప్రీంకోర్టు అంగీకరించి సోమవారం తొలికేసుగా విచారణ జరుపుతామని ప్రకటించింది. ఆ మేరకు సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగాయ్‌తో కూడిన ధర్మాసనం అన్నాడీఎంకే శాసనసభ్యుల పిటిషన్‌పై తొలుత విచారణను ప్రారంభించింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది కపిల్‌సిబల్‌ హాజరయ్యారు. స్పీకర్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ హాజరయ్యారు. కపిల్‌ సిబల్‌ తన వాదనలను వినిపిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే స్పీకర్‌ ధనపాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న తరుణంలో అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకుగాను నోటీసులు జారీ చేయడం న్యాయసమ్మతం కాదని, అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న స్పీకర్‌కు శాసనసభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన పలు తీర్పులను కూడా ఉదహరించారు.
 
అంతే కాకుండా తమిళనాట ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులో ఉన్న సమయంలో స్పీకర్‌ ధనపాల్‌ శాసనసభ్యులపై తన అధికారాన్ని చెలాయిం చాలనుకోవడం కూడా తప్పిదమవుతుం దన్నారు. స్పీకర్‌ తరఫు న్యాయవాది రోహత్గీ వాదిస్తూ శాసనసభ్యులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు వుందని, స్పీకర్‌ నిర్ణయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, పైగా ముగ్గురు శాసనసభ్యులకు ప్రస్తుతం సంజాయిషీ కోరుతూ నోటీసులు మాత్రమే జారీ చేశారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాద ప్రతివాదనల అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలతో ఏకీభవిస్తూ, స్పీకర్‌ జారీ చేసిన నోటీసుపై స్టే ఉత్తర్వులు విధిస్తున్నట్లు ప్రకటించింది. దాంతోపాటు నాలుగు వారాలలోపున కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ స్పీకర్‌కు నోటీసు కూడా జారీ చేసింది.
 
ధర్మం గెలిచింది: రత్నసభాపతి
ఇదిలా వుండగా, స్పీకర్‌ ధనపాల్‌ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయడంపై అరంతాంగి శాసనసభ్యుడు రత్నసభాపతి చేపాక్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశంతో ధర్మం గెలిచిందని అన్నారు. తాము ముగ్గురమూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, ఇప్పటికీ తాము ఆ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన (ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా) 11 మంది శాసనసభ్యులపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా, వారికి పదవులిచ్చి గౌరవించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మార్గంలోనే తాము నడుస్తున్నామని, పార్టీకి ప్రభుత్వానికి ద్రోహం చేసే ప్రసక్తే లేదని అన్నారు. స్పీకర్‌ నోటీసు ప్రకారం మంగళవారం ఆయనను కలుసుకోవాలా వద్దా అనే విషయంపై న్యాయనిపుణులతో సంప్రతింపులు జరిపిన మీదట నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 
జూన్‌ వరకూ స్పీకర్‌కు బ్రేక్‌
అన్నాడీఎంకే శాసనసభ్యులు ముగ్గురికి జారీ చేసిన నోటీసులపై స్పీకర్‌ ధనపాల్‌ వచ్చే జూన్‌ నెల దాకా ఎలాంటి చర్యలు తీసుకోలేరని న్యాయనిపుణులు చెబుతున్నారు. స్పీకర్‌ నోటీసుపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించడంతోపాటు నాలుగు వారాల్లో ఆయన కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. నాలుగువారాలలోపు స్పీకర్‌ కౌంటర్‌ను దాఖలు చేసినా సుప్రీంకోర్టు అప్పటికప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉండదని తెలిపారు. వారం రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు రానున్నాయని, స్పీకర్‌ కౌంటర్‌ దాఖలు చేసిన అన్నాడీఎంకే శాసనసభ్యులిరువురి పిటిషన్‌పై విచారణ జరుగదని తెలిపారు. సెలవులలో పనిచేసే న్యాయమూర్తులు అత్యవసర కేసులు మాత్రమే విచారణ జరుపుతారని కనుక, ఒకటిన్నర నెల తర్వాతే ఈ కేసుపై మళ్లీ విచారణ ప్రారంభమవుతుందని అంత వరకు స్పీకర్‌ ముగ్గురు శాసనసభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేరని పేర్కొన్నారు.
 
అంతే కాకుండా డీఎంకే ప్రతిపాదిస్తున్న స్పీకర్‌పైన అవిశ్వాసతీర్మానం కూడా శాసనసభ సమావేశం జరిగే సమయంలో ప్రవేశపెట్టబోతున్నారు. శాసనసభ సమావేశాలు కూడా జూన్‌లో ప్రారంభమవుతాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు విధించిన స్టే జూన్‌ వరకు కొనసాగితీరుతుందని సీనియర్‌ న్యాయవాది తమిళ్‌మణి చెప్పారు. సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆ ముగ్గురు శాసనసభ్యులు స్పీకర్‌ ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వనక్కర్లేదని చెప్పారు. సుప్రీంకోర్టు విధించిన స్టే ఉత్తర్వులు పిటిషన్‌ వేసిన అరంతాంగి, విరుదాచలం శాసనసభ్యులు రత్నసభాపతి, కళై సెల్వన్‌లకు మాత్రమే కాకుండా కల్లకురిచ్చి శాసనసభ్యుడు ప్రభు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *