మేమూ చేశాం 6 సర్జికల్‌ దాడులు


 • మీలాగా ఛాతి చరుచుకోలేదు
 • ఇవిగో సాక్ష్యాలు: కాంగ్రెస్‌
 • ఫొటోలు, తేదీలతో సహా వెల్లడి
న్యూఢిల్లీ, మే 2(ఆంధ్రజ్యోతి): మన్మోహన్‌ సింగ్‌ హయాంలో పాకిస్థాన్‌ మీద ఆరుసార్లు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగినట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ భద్రతను ప్రధాన ప్రచారాంశంగా బీజేపీ మార్చడంతో కాంగ్రెస్‌ దీటుగా స్పందించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఫోటోలతో సహా గురువారం విడుదల చేసింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసేందుకు 2008-2014 మధ్య కాలంలో భారత సైన్యం సరిహద్దులు దాటి ఆరు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ నిర్వహించిందని కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ శుక్లా విలేకరుల సమావేశంలో చెప్పారు. వీటి గురించి యూపీఏ ప్రభుత్వం ఏనాడూ ప్రచారం చేసుకోలేదని, ఛాతీని బాదుకుంటూ తమదే ఘనతని చెప్పుకోలేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని దుయ్యబట్టారు.
 • యూపీఏ హయాంలో సర్జికల్‌ దాడులు
 • మొదటి సర్జికల్‌ దాడి: (2008 జనవరి 19) పాకిస్థాన్‌లోని
 • పూంచ్‌ సెక్టార్‌కు చెందిన బట్టాల్‌ సెక్టార్‌.
 • రెండో సర్జికల్‌ దాడి: (2011 ఆగస్టు 30-సెప్టెంబరు 1)
 • పీవోకేలోని కేల్‌ ప్రాంతంలోని నీలుమ్‌ నదీ లోయ.
 • మూడో సర్జికల్‌ దాడి: (2013 జనవరి 6)సవన్‌ పాత్ర చెక్‌పోస్టు
 • నాలుగో సర్జికల్‌ దాడి: (2013 జూలై 27-28) నాజాపూర్‌ సెక్టార్‌.
 • ఐదో సర్జికల్‌ దాడి: (2013 ఆగస్టు 6) నీలుమ్‌ నదీ లోయ.
 • ఆరో సర్జికల్‌ దాడి: (2014 జనవరి 14)నీలుమ్‌ నదీ లోయ.
మన్మోహన్‌దీ అదే మాట
తన ప్రభుత్వ హయాంలో అనేక పర్యాయాలు సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగాయని, కాని వాటిని ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన తమకు ఏనాడూ రాలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బుధవారం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరుసటి రోజే కాంగ్రెస్‌ ఆధారాలతో సహా వాటిని బయటపెట్టడం గమనార్హం. ఆర్థిక రంగంలో ఘోర వైఫల్యం చెందిన ప్రధాని మోదీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సైనిక దళాల పరాక్రమం వెనుక దాక్కున్నారని మన్మోహన్‌ తన ఇంటర్వ్యూలో విమర్శించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *