మే 23న వెల్లడికాబోయే గుంటూరు జిల్లా ఎన్నికల ఫలితాలపై టీడీపీ, వైసీపీ అంచనాలివి..!


రాజకీయాలకు పురిటి గడ్డ గుంటూరు జిల్లా. పౌరుషాల పురిటి గడ్డగా చరిత్రలో నిలిచిన పల్నాడు ప్రాంతం ఈ జిల్లాలో అంతర్భాగమే. ఈ జిల్లా నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులుగా, పలు కీలక శాఖలకు మంత్రులుగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సేవలందించిన కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి నేటి విభజిత ఏపీ శాసనసభ తొలి స్పీకర్‌గా పనిచేసే అరుదైన అవకాశం దక్కించుకున్న కోడెల శివప్రసాదరావు వరకూ పలువురు గుంటూరు జిల్లా నుంచి గెలిచి నిలిచిన వారే. అలాంటి ఈ జిల్లాలో ఈసారి రాజకీయం పేరుకు తగ్గట్టుగానే గుంటూరు మిర్చిలా ఘాటెక్కింది. ఏపీలోనే అత్యధిక శాసససభ స్థానాలు కలిగిన రెండో జిల్లా కావడం, ప్రస్తుత నవ్యాంధ్ర రాజధాని కూడా ఈ జిల్లాలోనే ఉండటంతో గుంటూరు జిల్లా ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చి ఉంటారనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
 
గుంటూరు జిల్లా ఓటర్లు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టారు. జిల్లాలో ఉన్న 17 శాసనసభ స్థానాల్లో టీడీపీ 12 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. అంతేకాదు, జిల్లాలోని మూడు ఎంపీ స్థానాలకు మూడింటినీ కూడా కైవసం చేసుకుని సత్తా చాటింది. జిల్లాలో వైసీపీకి ఒక్క పార్లమెంట్ స్థానం దక్కకపోగా, కేవలం 5 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ ఐదింటిలో కూడా ఒక్క నరసరావుపేట శాసనసభ స్థానంలో మాత్రమే 15వేల మెజార్టీ సాధించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో ఒకటైన మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బ్యాలెట్ ఓట్ల సాయంతో గట్టెక్కిన పరిస్థితి 2014లో నెలకొంది.
 
అయితే.. ఈసారి జిల్లా వైసీపీ శ్రేణులు 2009 సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2004లో వైఎస్ పాదయాత్ర చేసిన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో అప్పటికి ఉన్న 19 స్థానాల్లో కాంగ్రెస్‌కు రెబల్ అభ్యర్థి పోటీ చేసిన స్థానంతో కలిపి మొత్తం 17 స్థానాలు దక్కాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ పొన్నూరు, మాచర్ల స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే.. 2009 నాటికి టీడీపీ పుంజుకుంది. అప్పటికి జిల్లాలో ఉన్న 17 స్థానాల్లో 6 స్థానాల్లో గెలుపొందింది.
 
2014 నాటికి సీన్ పూర్తిగా మారింది. టీడీపీ 12 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. దీంతో ఈ ఎన్నికల్లో కూడా ఇదే హవా కొనసాగిస్తామని టీడీపీ నేతలు చెబుతుంటే, త్రిముఖ పోటీలో తమకే మెజార్టీ సీట్లు వస్తాయని వైసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే.. జిల్లాలో టీడీపీ గెలుపు కొన్ని స్థానాల్లో దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వినుకొండ, చిలకలూరిపేట, తెనాలి, పొన్నూరు, గురజాల, రేపల్లె, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి స్థానాలు తమవేనని టీడీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే.. వినుకొండ, చిలకలూరిపేట, గురజాల, పొన్నూరు, పెదకూరపాడు, తాడికొండ స్థానాల్లో అభ్యర్థులను మార్చిన వైసీపీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. మంగళగిరిలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నారా లోకేష్ విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
 
జిల్లాలో గెలుపుపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్న ఏకైక నియోజకవర్గం నరసరావుపేట. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 15వేలకు పైగా మెజార్టీ సాధించడం, వైసీపీకి కొమ్ముకాసే ప్రధాన సామాజిక వర్గం వైసీపీ అభ్యర్థికి అండగా ఉండటంతో ఈసారి కూడా మెజార్టీ తగ్గినప్పటికీ గెలుపు ఖాయమనే అంచనాకు వైసీపీ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బీసీ అభ్యర్థిని బరిలోకి దింపిన అధిష్టానం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది.
 
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారని.. ఈసారి టీడీపీకే అవకాశం ఇస్తారని ఆ పార్టీ స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారు. ఇక ప్రత్తిపాడు, వేమూరు, బాపట్ల, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి, మాచర్ల స్థానాల్లో ఉత్కంఠ పోరు తప్పదని ఇరు పార్టీలూ భావిస్తున్నాయి. మొత్తం మీద గుంటూరు జిల్లా ఫలితాలు ఈసారి కూడా టీడీపీకే అనుకూలంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *