మొదట వెక్కిరించి… ఇప్పుడు మేము సైతం అంటారా?: మోదీ ఆగ్రహం


న్యూఢిల్లీ : తమ హయాంలో తాము సైతం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ మొదటేమో ఈ వ్యవహారాన్ని వెక్కిరిస్తూ మాట్లాడారని, తర్వాత వ్యతిరేకించారని, ఇప్పడు మాత్రం తాము కూడా… తాము కూడా… అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్స్‌ని కేవలం పేపర్లమీదే చేసిందని, నిజమైన దాడులను చేయలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గడచిన నాలుగు విడతల్లో కాంగ్రెస్ బలహీనపడింది అని గ్రహించి ఇప్పుడు డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తమ హయాంలోనూ తీవ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించామని కాంగ్రెస్ నాయకుడు వెల్లడించారని, ఇప్పుడు వాటిని నిర్ధరించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ దాడులు చేసినట్లు కనీసం తీవ్రవాదులకు కూడా తెలియదని, పాకిస్తాన్ వారికి అసలే తెలియదని, ఇక భారత ప్రజల గురించి చెప్పాల్సిన అవసరమే లేదని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు చిన్నతనంలో వీడియో గేమ్ ఆడేవారని, మెరుపు దాడులంటే ఇప్పటికీ వారు వీడియో గేమ్ ఆడినంత తేలికగా అనుకుంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *