మోదీకి ఓటమి భయం పట్టుకుంది : మమత


కోల్‌కతా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు. కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార సభలో శనివారం ఆమె మాట్లాడుతూ మోదీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే పశ్చిమ బెంగాల్‌లో ప్రజలను మతపరంగా విభజించి గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయనకు తెలిసిపోయిందని, అందుకే ఆయన ముకం మాడిపోయిందని అన్నారు. ఆయనకు ఓటమి ఫోబియా పట్టుకుందన్నారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, న్యూఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తదితర రాష్ట్రాల్లో ఓటమి గురించి ఆలోచిస్తూ రోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
 
‘‘త్రిపురలో బీజేపీ గెలిచినా నేను పట్టించుకోను. అక్కడ గెలిచినా ఆ పార్టీకి 543 సీట్లు రావు. అందుకే ఆయన (మోదీ) బెంగాల్‌లో తిరుగుతున్నారు. ప్రజలను హిందూ-ముస్లింలంటూ విభజిస్తూ ఓట్లు సంపాదించుకోవచ్చునన్న ఆశతో వస్తున్నారు’’ అని మమత అన్నారు. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. దేశాన్ని కాపాడాలనుకుంటే బీజేపీకి ఓటు వేయవద్దని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పడిన అవస్థలను మర్చిపోయారా? అని అడిగారు. కోట్లాదిమంది ఈ నిర్ణయం వల్ల బాధలు అనుభవించారన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీరు ఆయనకు సమాధానం చెప్పరా? అని అడిగారు.
 
‘‘వాళ్ళకి (బీజేపీకి) వ్యతిరేకంగా ఓట్లు వేసి, పెద్ద నోట్లను రద్దు చేసినందుకు వాళ్ళకు చెంప దెబ్బ కొట్టండి’’ అని మమత బెనర్జీ పిలుపునిచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *