మోదీపై ఎందుకు పోటీచేయలేదో కారణం చెప్పిన ప్రియాంక


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి పోటీకి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందనే విషయంపై ప్రియాంక గాంధీ మౌనం వీడారు. తనపై పార్టీ ఉంచిన బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయంచుకోవడమే ఇందుకు కారణమని తెలిపారు.
 
అమేథీలో మంగళవారంనాడు ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని పార్టీ సీనియర్ నేతలు, పార్టీ సహచరుల నుంచి సలహాలు తీసుకున్నాను. ఇక్కడున్న 41 సీట్ల బాధ్యత మీపై ఉందని వారు గట్టిగా అభిప్రాయపడ్డారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా తమ తరఫున నేను ప్రచారం చేయాలని బలంగా కోరుకున్నారు. వారి మాటలు విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది. కేవలం ఒకే సీటుపై (వారణాసి) దృష్టి పెట్టడం వల్ల వారిని (పార్టీ అభ్యర్థులను) నిరుత్సాహపరిచినట్టు అవుతుందని భావించాను’ అని ప్రియాంక తెలిపారు.
 
మోదీపై పోటీకి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న వాదనలో అర్ధం లేదని ఆమె పేర్కొన్నారు. తాను మొదట్నించీ పార్టీ ఏది చెబితే అది చేస్తానని చెప్పడం జరిగిందని తెలిపారు. పార్టీ తనపై అప్పగించిన బాధ్యతలనే ఇప్పుడు తాను చేస్తున్నానని ప్రియాంక వివరణ ఇచ్చారు. కాగా, సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలి నుంచి పోటీ చేయాల్సిందిగా కార్యకర్తలు ఇటీవల ప్రియాంక గాంధీని కోరినప్పుడు, వారణాసి నుంచి ఎందుకు చేయకూడదంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో, మోదీకి పోటీగా వారణాసి నుంచి ప్రియాంక నిలబడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, ఈ ఊహాగానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం గత వారంలో తెరదించుతూ, వారణాసి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా స్థానిక నేత అజయ్ రాయ్‌ పేరును ప్రకటించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *