మోదీపై పోటీకి సిద్ధమే, కానీ… : ప్రియాంక గాంధీ


న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పోటీకి కాంగ్రెస్ తూర్పు ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తనను కోరితే బరిలోకి దిగుతానన్నారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాద్ నుంచి బయల్దేరే ముందు ప్రియాంక మాట్లాడుతూ, ‘‘నేను పోటీకి సిద్ధమే, కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను అడిగితే వారణాసి నుంచి పోటీ చేస్తాను’’ అని చెప్పారు. వయనాద్‌ నియోజకవర్గంలో ప్రియాంక రెండు రోజులపాటు ప్రచారం చేశారు. రాహుల్ పోటీ చేస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలో కూడా ప్రియాంక ప్రచారం చేస్తున్నారు.
 
వయనాద్‌లో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే, రైతుల అవసరాలన్నీ తీర్చుతుందని హామీ ఇచ్చారు.
 
ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగడంపై రాహుల్ గాంధీని గతంలో ప్రశ్నించినపుడు ఆయన మాట్లాడుతూ, అది ఆమె తీసుకోవలసిన నిర్ణయమని చెప్పిన సంగతి తెలిసిందే. గత వారం ఆయన మాట్లాడుతూ మోదీపై వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేస్తారా? లేదా? అనే అంశంపై సస్పెన్స్‌ను కొనసాగించడంలో నష్టమేమీ లేదన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *