మోదీపై మాయావతి షాకింగ్ కామెంట్స్…


లక్నో: 2019 సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకున్న తరుణంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తమ భర్తలు మోదీని కలుస్తున్నారంటేనే బీజేపీలోని మహిళా ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారనీ.. మోదీలాగే తమను కూడా భర్తలు వదిలేస్తారేమోనని వారు భయపడుతున్నారని మాయావతి వ్యాఖ్యానించారు. ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘బీజేపీలో, వివాహితులైన మహిళా నేతలు తమ భర్తలను మోదీతో పాటు చూస్తే తెగ భయపడిపోతున్నారు. మోదీ తమను కూడా  భర్తల నుంచి దూరంచేస్తారేమోనని వాళ్లకు దిగులు పట్టుకుంది…’’ అని వ్యాఖ్యానించారు. అళ్వార్‌ సామూహిక అత్యాచారంపై రేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
అళ్వార్ అత్యాచార ఘటనపై మాయావతి మొసలికన్నీరు కారుస్తున్నారంటూ ప్రధాని మోదీ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాయవతి.. మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. తన భార్యనే వదిలేసిన మోదీకి మహిళలపై గౌరవం ఎలా ఉంటుందంటూ విమర్శించారు. ‘‘అళ్వార్ అత్యాచారంపై ప్రధాని మోదీ నోరు విప్పడంలేదు. దీనిపై ఆయన తన పార్టీకి మేలు చేకూరేలా నీచ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అత్యంత సిగ్గుచేటైన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం తన సొంత భార్యనే వదిలేసిన మోదీకి ఇతరుల భార్యలు, సోదరీల పట్ల ఎలా గౌరవం ఉంటుంది..’’ అంటూ మాయావతి విరుచుకుపడ్డారు.
 
ఈ కేసును ఉపయోగించుకుని దళితుల ఓట్లు దండుకునేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. షహ్రాన్‌పూర్‌లోని షబ్బీర్పూర్ ఘటనతో పాటు రోహిత్ వేముల, ఉన్నావ్ ఘటనలను దళితులు మర్చిపోలేదని ఆమె దుయ్యబట్టారు. కాగా ఏప్రిల్‌ 26న రాజస్థాన్‌లోని అళ్వార్‌లో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు దంపతుల్ని అటకాయించిన దుండగులు… భర్తను కొట్టి అతని కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *