మోదీ ఉగ్రవాదుల్ని చంపాడుగా!


  • దిగ్విజయ్‌సింగ్‌కు భోపాల్‌ యువకుడి షాక్‌
భోపాల్‌, ఏప్రిల్‌ 22: మోదీని తిట్టించడానికి ఒక యువకుణ్ని వేదిక ఎక్కిస్తే.. ఆ కుర్రాడు కాస్తా మోదీని పొగడడంతో అవాక్కవాల్సి వచ్చింది! మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు సోమవారం ఎదురైన అనుభవమిది. భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న డిగ్గీరాజా సోమవారం ప్రచారంలో పాల్గొన్నారు. భోపాల్‌ శివార్లలోని ఈంట్‌ఖేడీ వద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొస్తామన్న హామీని మోదీ నిలబెట్టుకోలేకపోయారని మండిపడ్డారు. ‘‘నల్లధనాన్ని తిరిగితెస్తామని.. ఆ డబ్బు వస్తే ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు పడతాయని బీజేపీ చెప్పేది. మీలో ఎంత మంది ఆ సొమ్ము అందుకున్నారు?’’ అని ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించగా.. ఒక యువకుడు చెయ్యెత్తాడు. దిగ్విజయ్‌ సింగ్‌ నవ్వుతూ అతణ్ని వేదికపైకి ఆహ్వానించారు. అతడు వేదికపైకి రాగానే చేతికి మైకు ఇచ్చారు. అతడి వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు తెలిపితే.. అతడికి రూ.15 లక్షలు అందిందీ లేనిదీ ధ్రువీకరించుకుని, ఒకవేళ అందితే బహిరంగంగా స్వాగతిస్తామని చెప్పారు. కానీ, అతడు ఆ విషయాలు చెప్పకుండా.. ‘మోదీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపి ఉగ్రవాదులను ఏరిపారేశారుగా?’ అన్నాడు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ నేతలు అతడికి మరింక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వేదికపైనుంచి బలవంతంగా దింపేశారు. మరోవైపు దిగ్విజయ్‌ కోపంగా.. ‘నువ్వు సర్జికల్‌ స్ట్రైక్‌ గురించి మాట్లాడుతున్నావు. నీకు (నల్లధనం) డబ్బు అందిందా?’ అని ప్రశ్నించారు. ఆ యువకుణ్ని అబద్ధాలకోరుగా అభివర్ణించారు. మోదీ , ఆయన అభిమానులు అబద్ధాలకోరులేనన్నారు. కాగా.. వేదికపై నుంచి దింపేసిన యువకుడు అక్కడి నుంచి వెళ్లకుండా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అతణ్ని చుట్టుముట్టారు. దాదాపు 15 నిమిషాలసేపు అక్కడే ఉంచేశారు. తన ప్రసంగాన్ని కొనసాగించిన దిగ్విజయ్‌.. ఆ యువకుడి ప్రస్తావన పదేపదే తెస్తూ అతణ్ని ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *