మోదీ ఎందుకు భయపడుతున్నారు..? : చంద్రబాబు


అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ల వర్షం కురిపించారు. శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ బాబు ట్వీట్లు చేశారు. దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం వీవీ ఫ్యాట్‌ల స్లిప్పులను లెక్కించాలనే పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ.. తమ పోరాటం భారత ఎన్నికల సంఘంపై కాదని.. మా పోరాటం అధికారుల వివక్షతపై, పక్షపాత ధోరణిపైనేనని చెప్పుకొచ్చారు. మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఈసీ అమలు చేయకపోవడంపైనే పోరాటం చేస్తానని బాబు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
 
ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు..?
ఎన్నికల షెడ్యూల్‌కు 73 రోజులు తీసుకున్న ఈసికి 50% వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం..? నరేంద్రమోదీ ఎందుకు భయపడుతున్నారు..? 50% వీవీ ప్యాట్‌లు లెక్కించాలని ఈసిని ప్రతిపక్షాలు అడిగితే మోదీకి ఏం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు..?. రాజకీయ లాభం కోసం ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా మోదీ వెనుకాడరు. రక్షణ శాఖను, సైన్యాన్నీ వాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన మాకు నీతిపన్నాలు ప్రబోధిస్తారు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
 
కొత్త టీమ్‌ను ప్రజలు ఎన్నుకుంటారు!
మే 23న దేశ ప్రజలు ప్రధానిగా నరేంద్ర మోదీ, అతని టీమ్‌ను తిరస్కరించడం ఖాయం. అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్‌నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోదీ టీమ్‌కు పరాజయం ఖాయం. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్‌ను ప్రజలే ఎంపిక చేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారుఅని మోదీపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. అయితే చంద్రబాబు వరుస ట్వీట్లపై బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *