మోదీ క్లౌడ్ థియరీపై నెటిజన్ల సెటైర్లు…!


న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన వైమానిక దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆరోజు వాతావరణం అనుకూలంగా లేకపోయినా వైమానిక దాడులకు అనుమతి ఇవ్వడంపై ప్రధాని చెప్పిన సమాధానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి పొంతన లేకపోవడమే దీనికి కారణం. ‘‘ వాస్తవానికి ఆకాశంలో కమ్ముకున్న మేఘాలు మన విమానాలు శత్రు రాడార్లను తప్పించుకునేందుకు సహాయపడతాయి…’’ అని ప్రధాని మోదీ నిన్న ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. ఈ మిషన్‌పై రక్షణ నిపుణులు వ్యక్తం చేసిన సందేహాలను తిప్పికొట్టేందుకు తాను తన ‘‘మిడిమిడి జ్ఞానాన్ని’’ ఉపయోగించినట్టు ఆయన వెల్లడించారు. ‘‘ఇలా ఎప్పుడు చూడలేదని మన దేశ నిపుణులు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది..’’ అని ప్రధాని పేర్కొన్నారు.
 
అయితే ప్రధాని మోదీ విశ్లేషణకు ఏమాత్రం సాంకేతిక ఆధారం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. మేఘాల ఆవల అస్పష్టంగా ఉన్నప్పటికీ ఆయా వస్తువులను పసిగట్టేందుకు రాడార్ టెక్నాలజీ రేడియో తరంగాలను వినియోగిస్తుందనీ… కాబట్టి బాలాకోట్‌ ప్రాంతంలోని మేఘాల వల్ల భారత యుద్ధ విమానాలకు ఎలాంటి ఉపయోగం లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల నుంచి కూడా తీవ్రస్థాయిలో ప్రధాని వ్యాఖ్యలపై కామెంట్లు వెల్లువెత్తాయి. ‘‘ఇక ఆరోజు యుద్ధ విమానాలు నడిపిన పైలట్లలో ఆయన కూడా ఉన్నారని చెప్పడమే తరువాయి…’’ అని ఓ నెటిజన్ చమత్కరించారు. ‘‘ చల్లగా ఉంటుంది కాబట్టి సూర్యుడి మీదికి రాత్రివేళ అంతరిక్ష నౌకను పంపమన్నట్టుంది మోదీ వ్యవహారం..’’ అని మరో నెటిజన్ నవ్వుల టపాసు పేల్చాడు.
 
‘‘మూన్ మిషన్ చేపట్టేందుకు ఇస్రో సిద్ధంగా లేదు. నిపుణులు రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. అయితే పౌర్ణమినాడు చంద్రుడిపైకి ప్రయోగం చేపట్టాలని నేను వారితో చెప్పాను. ఎందుకంటే అప్పుడు చంద్రుడు పెద్దగా ఉంటాడు కాబట్టి అంతరిక్ష నౌక దిగడానికి ఎక్కువ స్థలం ఉంటుంది కదా..’’ అని మన ప్రధాని చెప్పినట్టు మరో నెటిజన్ కామెంట్ రాశారు. ఇలా ఒకటేమిటి వందల కొద్దీ కామెంట్లు వెల్లువెత్తడంతో… బీజేపీ ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోను తొలగించారు.
 
ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌‌పీఎఫ్ సైనికులు మరణించారు. ఈ దాడి జరిపింది తామేనంటూ పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. దీంతో బాలాకోట్‌లోని జైషే ప్రధాన స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ వైమానిక దళం కూడా భారత్‌పై వైమానిక దాడులకు ప్రయత్నించడం… వీటిని తిప్పికొట్టుడుతూ భారత పైలట్ పాకిస్తాన్‌‌కి చిక్కడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పాకిస్తాన్ భారత పైలట్‌ను తిరిగి స్వదేశానికి పంపడంతో ఉద్రిక్తతలు చల్లబడ్డాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *