మోదీ దుర్యోధనుడు అయితే… నీ తండ్రి రావణుడు: ప్రియాంకకు బీజేపీ నేత కౌంటర్!


ఇండోర్: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేతలు మాటల యుద్ధం మరింత తీవ్రం చేశారు. రాజీవ్ నంబర్ వన్ అవినీతిపరుడంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు మరింత తారాస్థాయికి చేరింది. రాజీవ్ గాంధీ రావణాసుడులాంటి వాడని మధ్యప్రదేశ్ బీజేపీ నేత జీతూ జితారి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని దుర్యోధనుడితో పోల్చుతూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే ఆమె తండ్రిని బీజేపీ నేతలు రావణాసుడితో పోల్చడం గమనార్హం.
 
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమక్షంలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో జితారి మాట్లాడుతూ…. ‘‘ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని దుర్యోధనుడితో పోల్చుతున్నారు. కానీ ఆమె తండ్రి రావణుడు. ఆయన ఏకంగా దేశాన్నే అమ్మేశారు…’’ అని ఆరోపించారు. కాగా ప్రధాని మోదీ రాజీవ్ గాంధీని అవినీతి పరుడంటూ వ్యాఖ్యానించడంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం మోదీ ‘‘విద్వేషాన్ని’’ తాము ‘‘ప్రేమ’’తోనే ఎదుర్కొంటామంటూ బదులిచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయం తుది అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో  మాటల యుద్ధం కొనసాగుతోంది. 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *