మోదీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ…


న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగానే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 2019 ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు పతాక స్థాయికి చేరుకున్నట్టు ఓ స్వతంత్ర సంస్థ గణాంకాలు బయటపెట్టింది. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ రేటు 7.6 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. ముంబై కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ మేరకు తాజా గణాంకాలను వెలువరించింది.
 
ఈ సర్వే ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రత్యేకించి కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ-బీఎస్పీ కూటమికి మరో ఆయుధంగా మారనుంది. ఎన్నికల సీజన్‌లో మోదీ విధానాలపై నిలదీసేందుకు అవకాశం చిక్కనుంది. వాస్తవానికి ప్రతి ఐదేళ్లకోసారి భారత ప్రభుత్వం నిరుద్యోగ వివరాలను వెల్లడిస్తుంది. అయితే డిసెంబర్లో ఈ గణాంకాలు మీడియాలో లీక్ అయ్యాయి. 2017-18 సమయంలో గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ రేటు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో ఈ సర్వే కచ్ఛితత్వాన్ని తనిఖీ చేయాల్సిన అవసరముందని అధికారులు చెప్పారంటూ కేంద్రం ప్రభుత్వం నిరుద్యోగ డేటా విడుదలను నిలిపివేసింది.
 
కాగా 2016 అక్టోబర్ తర్వాత నిరుద్యోగ రేటు ఈ మేరకు పెరగడం ఇదే తొలిసారి అని సీఎంఐఈ వెల్లడించింది. మార్చి నెలలో నిరుద్యోగ రేటు కొంతమేర తగ్గుతున్నట్టు కనిపించినా.. ఏప్రిల్‌ ఇది ఇంతకు ముందులాగానే అమాంతం పెరిగిందని సీఎంఐఈ హెడ్ మహేశ్ వ్యాస్ వెల్లడించారు. మే నెలాఖరుకు ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వం, దాని నూతన విధానాల కోసం తయారీ సంస్థలు ఎదురుచూస్తుండడమే నిరుద్యోగ రేటు ఒక్కసారిగా ఎగసిపడడానికి కారణమని తెలుస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *