రక్తం తోడేస్తున్న తలసేమియా!


  •  ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారి
  •  లక్షలు ఖర్చు చేయలేని దీనస్థితి
  •  దాతల సాయం కోసం ఎదురుచూపు
నాగాయలంక, ఏప్రిల్‌ 21: ఆడి పాడాల్సిన వయసులో ఆ చిన్నారికి ఊహించని కష్టమొచ్చింది. ప్రాణాలతో చెలగాటమాడే మహమ్మారి తలసేమియా వ్యాధి.. ఆ పసివాడిని మృత్యు ఒడికి లాక్కుపోతోంది. వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు వేలకువేలు ఖర్చుచేసి రక్తం కొనుగోలు చేసే స్థోమత లేక దినదినగండంగా నెట్టుకొస్తున్నారు. వైద్యం చేయించే స్థోమత లేక.. ఎవరైనా దాతలు సాయం అందించి తమబిడ్డకు పునర్జన్మ ప్రసాదించాలని దీనంగా వేడుకుంటున్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన చీరాల సోమయ్య దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి మొదటి సంతానమైన భాగ్యరాజా (10) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 2016లో విజయవాడ ఆంధ్రా ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తే తలసేమియా వ్యాధి అని వైద ్యులు నిర్ధారించారు. తలసేమియా జన్యు సంబంధమైన వ్యాధి. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి. హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గిన ప్రతిసారి రోగికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. జీవితాంతం ఎక్కిస్తూనే ఉండాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. దళిత కుటుంబానికి చెందిన భాగ్యరాజా తల్లిదండ్రులు ఇప్పటికే శక్తికి మించి వేలాది రూపాయలు వెచ్చించి కొడుకును బతికించుకుంటూ వచ్చారు.
 
చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక కుమిలిపోతున్నారు. వారి దీనావస్థను చూసి విజయవాడకు చెందిన సజ్జా ఫౌండేషన్‌ బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చులో కొంత భరించేందుకు ముందుకు రావడంతో తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. మిగిలిన ఖర్చుల కోసం దాతలు ఆర్థిక చేయూతనిచ్చి తమ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టాలని వారు అర్థిస్తున్నారు. సాయం అందించే దాతలు 9494772996 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని వేడుకుంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *