రవాణా ఆల్‌టైమ్‌ రికార్డ్‌!


  • రాష్ట్రంలో టాప్‌ లేపిన జిల్లా రవాణాశాఖ
  • రూ.445.56 కోట్ల ఆదాయార్జనతో అగ్రస్థానం
  • గత ఏడాదితో పోల్చుకుంటే రూ.25.39 కోట్ల అదనపు ఆదాయం
  • గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన కృష్ణా
  • తనిఖీల ఆదాయంలో ప్రభుత్వ టార్గెట్‌ను మించిన వైనం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కృష్ణా జిల్లా రవాణాశాఖ ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసింది. ఆదాయార్జనలో రాష్ట్రంలోనే టాప్‌ లేపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.445.56 కోట్ల ఆదాయంతో కృష్ణా జిల్లా రవాణాశాఖ అగ్రస్థానంలో నిలిచింది. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రూ.25.39 కోట్ల ఆదాయాన్ని అదనంగా సాధించింది. త్రైమాసిక, జీవితకాల పన్నులు, తనిఖీల్లో విధించిన జరిమానాలు, సేవా రుసుములు వంటి కేటగిరిలో అన్ని జిల్లాల కంటే అధికంగా ఆదాయాన్ని సాధించటం విశేషం. కిందటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన జిల్లా రవాణాశాఖ, ఈ ఏడాది మాత్రం ప్రథమ స్థానంలో నిలవటం గమనార్హం. ఈ మేరకు జిల్లా సాధించిన ఫలితాలను డీటీసీ ఇ.మీరాప్రసాద్‌ శనివారం తెలియజేశారు.
 
 
రాజధాని ప్రాంతంలో కృష్ణా జిల్లా రవాణాశాఖ దుమ్ము దులిపింది. ఆదాయార్జనలో మొదటిస్థానంలో నిలిచి సగర్వంగా నిలిచింది. జిల్లా రవాణాశాఖకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.509.97 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్య ఛేదనలో రవాణా శాఖ గణనీయమైన పనితీరునే కనబరిచింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నూరు శాతం సాధించకపోయినప్పటికీ రూ.445.56 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రభుత్వ టార్గెట్‌లో 87.36 శాతం రవాణాశాఖ సాధించింది. ప్రతి ఏడాది ప్రభుత్వం జిల్లాల వారీగా రిజిస్ర్టేషన్‌ శాఖకు టార్గెట్‌ ఇస్తుంది. ఈ టార్గెట్‌ను చేరుకోవటానికి అన్ని జిల్లాలు పోటీ పడతాయి. గత ఆర్థిక సంవత్సరాల్లో సాధించిన ఆదాయం ప్రాతిపదికన భవిష్యత్తు ఆదాయాన్ని కూడా అంచనా వేసి ప్రభుత్వం టార్గెట్‌లను నిర్ణయిస్తుంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో కృష్ణాజిల్లా రవాణాశాఖకు నిర్దేశించిన లక్ష్యంలో రూ.420.17 కోట్ల ఆదాయాన్ని సాధించింది. కిందటి ఏడాది ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది రూ.25.39 కోట్ల ఆదాయాన్ని అదనంగా సాధించింది. పెరుగుదలలో 6.4ు వృద్ధి నమోదైంది. త్రైమాసిక పన్ను(క్వార్టర్లీ ట్యాక్స్‌) కేటగిరిలో జిల్లాకు ప్రభుత్వం రూ.144.93 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా, రూ.124.11 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ సాధించింది. 2017-18లో రూ.118.80 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది 4.47 శాతం వృద్ధిని నమోదు చేసింది. జీవితకాల పన్ను(లైఫ్‌ట్యాక్స్‌) కేటగిరిలో ప్రభుత్వం జిల్లాకు రూ.229.73 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. టార్గెట్‌లో రూ.209.75 కోట్ల ఆదాయాన్ని రవాణా శాఖ సాధించింది. 2017-18లో రూ.183.78 కోట్ల ఆదాయాన్ని సాధించి, ఈ ఏడాది 14.13% వృద్ధి నమోదు చేసింది. తనిఖీలు చేసి అపరాధ రుసుములు విధించటంలో కూడా జిల్లా రవాణాశాఖ ఇతర జిల్లాలతో పోటీ పడింది. ప్రభుత్వం రూ.30.73 కోట్ల ఆదాయాన్ని నిర్దేశించగా రూ.32 కోట్ల మేర ఆదాయాన్ని రవాణాశాఖ సాధించింది. జరిమానాలు విధించటంలో రవాణాశాఖ ప్రభుత్వ టార్గెట్‌ను మించిపోయింది. అదనంగా రూ.1.27 కోట్లను ఈ కేటగిరీలో సాధించింది. ఫీజుల కేటగిరిలో రవాణాశాఖ వెనుకబడిందనే చెప్పాలి. ఫీజులకు సంబంధించి ప్రభుత్వం రూ.89.17 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా, రవాణాశాఖ రూ.66.13 కోట్లను మాత్రమే సాధించింది. కిందటి ఏడాది రూ.74.30 కోట్లు సాధించింది. గత ఏడాది ఆదాయంతో పోల్చుకుంటే 11ు శాతం తక్కువుగా సాధించింది. రవాణాశాఖ అందిస్తున్న సేవలకు సంబంధించి చూస్తే ప్రభుత్వం రూ.15.44 కోట్ల సేవా రుసుం లక్ష్యాన్ని విధించగా, రూ.13.57 కోట్ల మేర సాధించింది. గత ఏడాదిలో సాధించిన రూ.12.87 కోట్ల కంటే 5.48 శాతం పెరుగుదలను సాధించటం విశేషం.
 
సమష్టి కృషితో సత్ఫలితాలు
రవాణా శాఖ సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషికి నిదర్శనమే ఈ విజయం. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించటం ఆనందంగా ఉంది. ఆదాయార్జనలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన రవాణాశాఖ ఉద్యోగులు, అధికారులందరికీ అభినందనలు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం బాగా కలిసొచ్చింది. ఓవర్‌ లోడ్‌, డాక్యుమెంటేషన్‌ లేకపోవటం, డ్రైవింగ్‌ లైసెన్సులు లేకపోవటం, అధిక వేగం తదితర అంశాలపై తనిఖీ బృందాలు దాడులు చేయటం, కేసులు నమోదు చేయటం ద్వారా జరిమానాల రూపంలో గణనీయంగా ఆదాయాన్ని సాధించాం.
 
– ఇవ్వల మీరాప్రసాద్‌, డీటీసీ

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *