రష్యాతో కుమ్మక్కు నిజం కాదు గానీ…న్యాయప్రక్రియకు అడ్డుపడ్డ ట్రంప్‌!


  • వెల్లడించిన మ్యూలర్‌ నివేదిక
  • అమెరికాలో రాజకీయ రభస
  • అధ్యక్షుడిపై కాంగ్రెస్‌ విచారణకు డెమొక్రాట్ల యత్నం
వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 19: 2016లో అమెరికా అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికల్లో రష్యా సహకారం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ పూర్తిగా విముక్తులయ్యారు. రష్యా ఏజెంట్లను ఆయన నేరుగా సంప్రదించినట్లు గానీ, హిల్లరీ క్లింటన్‌ ఈమెయిల్స్‌ను హ్యాక్‌ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు గానీ ఆధారాల్లేవని ఈ ఆరోపణలపై 22 నెలల పాటు విచారణ జరిపిన రాబర్ట్‌ మ్యూలర్‌ కమిటీ ప్రకటించింది.
 
ట్రంప్‌ నేరపూరిత కుట్రకు పాల్పడ్డట్లు కూడ ఆధారాల్లేవని స్పష్టం చేసింది. కమిటీ తన తుది నివేదికను శుక్రవారం నాడు సమర్పించింది. నివేదిక సారాంశం ఇంతకుముందే వెలువడ్డప్పటికీ- అసలు ఆ ఆరోపణలొచ్చిన క్రమంలో ట్రంప్‌ చేసినదేంటన్నదానిపై కూడా కమిటీ పరిశీలించింది. ఆ విచారణ తన మెడకు చుట్టుకోకుండా ఆయన ఏకంగా మ్యూలర్‌ను డిస్మిస్‌ చేయాలని భావించినట్లు నివేదిక తేల్చింది.
‘‘2017 జూన్‌ 17న ట్రంప్‌ వైట్‌హౌస్‌ లాయర్‌ డాన్‌ మెక్‌గాన్‌ను తన నివాసానికి రమ్మన్నారు. మ్యూలర్‌కు ఇతరత్రా వ్యాపార ప్రయోజనాలున్నాయన్న కారణంతో తొలగించాలని తాత్కాలిక అటార్నీ జనరల్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. అయితే ట్రంప్‌ ఆదేశాలను డాన్‌ మెక్‌గాన్‌ అమలుపర్చలేదు. ఆ విషయాన్ని ఆ తరువాత న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా ప్రచురించింది. అది చూసిన ట్రంప్‌ మళ్లీ ఓవల్‌ ఆఫీసుకు మెక్‌గాన్‌ను పిలిపించి- పత్రికల్లో వచ్చినది తప్పు అని చెప్పమని ఒత్తిడి తెచ్చారు. కానీ మెక్‌గాన్‌ అదీ చెయ్యలేదు’’ అని నివేదిక వెల్లడించింది. ఈ వ్యవహారం ట్రంప్‌ -న్యాయప్రక్రియకు అడ్డుపడ్డారన్న ఆరోపణకు ఊతమిచ్చింది.
 
దీనిపై అనేకమంది డెమొక్రాట్‌ కాంగ్రెస్‌ సభ్యులు ట్రంప్‌ను నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, ట్రంప్‌ను రచ్చకీడుస్తామని, న్యాయానికి అడ్డుపడ్డారన్న అభియోగంపై ఆయనపై కాంగ్రెస్‌ విచారణ జరిపేలా ప్రయత్నిస్తామని 18మంది సభ్యులు స్పష్టం చేశారు. మ్యూలర్‌ను కాంగ్రె్‌సకు పిలిపించి విచారణ జరపాలని కూడా నిశ్చయించారు. ఈ చర్యలపై ట్రంప్‌ మండిపడ్డారు. ద్వేషంతో ప్రవర్తిస్తున్నారంటూ ట్వీట్‌ చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *