రాజీనామా చేయనున్న టీడీపీ మంత్రి?


అమరావతి: టీడీపీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిడారి శ్రవణ్ కుమార్ మంత్రి పదవి చేపట్టి మే 10వ తేదీకి ఆరు నెలలు పూర్తి కానుంది. శాసనసభ నియమ నిబంధనల ప్రకారం ప్రత్యక్షంగా ప్రజా ప్రతినిధి కాని వ్యక్తి మంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోపు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అంటే.. ఎమ్మెల్యేగానైనా లేక ఎమ్మెల్సీగానైనా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. లేని పక్షంలో మంత్రి పదవికి ఆ వ్యక్తి అనర్హులవుతారు.
 
ఇప్పుడు మంత్రి శ్రవణ్ కుమార్‌కు సరిగ్గా అలాంటి పరిస్థితే ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో అరకు అసెంబ్లీ స్థానానికి ప్రత్యేకంగా ఉప ఎన్నిక నిర్వహించలేదు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం శ్రవణ్ కుమార్‌కు రాలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్ అవ్వకపోవడంతో ఇప్పుడు కిడారి శ్రవణ్ మంత్రి పదవి కోల్పోవడం అనివార్యమైంది.
 
అయితే.. ఈ విషయంపై మంత్రి కిడారి శ్రవణ్ స్పందిస్తూ.. గవర్నర్ కార్యాలయం నుంచి తనకు ఎటువంటి సమాచారం అందలేదని, సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల కాల్పుల్లో చనిపోవడంతో ఆయన కుమారుడైన కిడారి శ్రవణ్ కుమార్‌కు మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా కిడారి శ్రవణ్ బాధ్యతలు చేపట్టారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *