రాహుల్‌కు వయనాడ్‌లోనూ లైన్ క్లియర్..


న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేరళలోని వయనాడ్‌లోనూ లైన్ క్లియర్ అయింది. వయనాడ్ లోక్‌సభ నియోజవర్గం నుంచి పోటీకి రాహుల్ గాంధీ సమర్పించిన అఫిడవిట్‌లో ఎలాంటి లోపాలు కనిపంచలేదంటూ ఎన్నికల కమిషన్ సోమవారంనాడు ప్రకటించింది.
 
రాహుల్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉందని, ఆయన అభ్యర్థిత్వాన్నిపరిశీలించాలని వయనాడ్ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుషార్ వెల్లప్పల్లి ఆదివారంనాడు సీఈసీ సునీల్ అరోరాను ఓ లేఖలో కోరారు. దీనిపై స్క్రూటినీ జరిపిన రిటర్నింగ్ అధికారి రాహుల్ అఫిడవిట్‌‌లో సమర్పించిన వివరాలు సరిగానే ఉన్నాయని నిర్ధారించారు. కాగా, అటు అమేథీలోనూ రాహుల్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురుకాగా, ఆయన అఫిడవిట్, అనుబంధ పత్రాలు సరిగానే ఉన్నాయని అమేథీ రిటర్నింగ్ అధికారి రామ్ మనోహర్ మిశ్రా సోమవారం ప్రకటించారు. రాహుల్ గాంధీ నామినేషన్‌ను సవాలు చేసిన ఫిర్యాదిదారు ఎలాంటి సాక్ష్యాలను సమర్పించలేదని, ఆయనపై చేసిన ఆరోపణలను సైతం రుజువు చేయలేకపోయారని మిశ్రా తెలిపారు. ఆ వెంటనే వయనాడ్ నుంచి కూడా రాహుల్‌కు లైన్ క్లియర్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈనెల 23న వయనాడ్‌లోనూ, మే 6న అమేథీలో పోలింగ్ జరుగనుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *