రాహుల్ గాంధీపై సుశీల్ మోదీ పరువు నష్టం దావా


పాట్నా : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ పరువు నష్టం దావా దాఖలు చేశారు. మోదీ అనే ఇంటి పేరు ఉన్నవారిని రాహుల్ అవమానించారని ఆరోపించారు.
 
సుశీల్ మోదీ ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం గురువారం పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ అవమానకర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు టీవీ ఛానళ్ళలో ప్రసారమయ్యాయని తెలిపారు. మోదీ అనే ఇంటి పేరుగలవారందరి పరువు, ప్రతిష్ఠలకు విఘాతం కలిగేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. అందరినీ ఒకే గాటన కట్టి వ్యాఖ్యానించినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
 
ఈ పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ జరుగుతుంది.
 
రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఈ నెల 13న జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీలను ప్రస్తావిస్తూ, దొంగలందరికీ ‘మోదీ’ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటోంది? అని ప్రశ్నించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *