రెండు రోజులు… 1100 టన్నులు…


  • వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ కారకాలే అధికం
  • పర్యావరణ ప్రేమికుల ఆందోళన
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : పర్యావరణం ప్రాణం తీసేస్తున్న అతి పెద్ద కారకం ప్లాస్టిక్‌. జీవనది ‘కృష్ణమ్మ’, దానికి అనుసంధాన కాల్వలను ఉసూరుమని పిస్తున్నది అదే. నీరు లేని నదీ గర్భంలో చూసినా, నీరున్న కాల్వలను తలదించి చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. ఈ అంశమే ఇప్పుడు పర్యావరణ ప్రేమికులను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు కాల్వల్లో అటూఇటూ తేలుతున్న చెత్తను ఎత్తడానికి చేపట్టిన ‘నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో…’ కళ్లు తేలేసే వాస్తవాలు కనిపిస్తున్నాయి. తొలిరోజున 300 టన్నుల వ్యర్థాలు బయటకు వస్తే, రెండో రోజు శుక్రవారం 800 టన్నుల వ్యర్థాలను బయటకు తీశారు. రెండు రోజుల్లో 1100 టన్నులు వ్యర్థాలను టిప్పర్లలో డంపింగ్‌ యార్డులకు తరలించారు. గాంధీనగర్‌లోని అలంకార్‌ సెంటర్‌ నుంచి కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కృతికా శుక్లా, బాబూరావు, మున్సిపల్‌ కమిషనర్‌ రామారావు తదితరులు ర్యాలీ నిర్వహించి, ప్రజలకు కాల్వల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఏలూరు లాకు వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.
 
రెండు రోజుల్లోనే 1100 టన్నుల చెత్తచెదారం బయటకు వస్తే, దీన్ని నిరంతరం చేపడితే ఇంకెన్ని టన్నుల వ్యర్థాల కృష్ణమ్మ కడుపులో నుంచి బయటకొస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రక్షాళనకు ముందు నుంచి ‘అవార’ (అమరావతి వాకర్స్‌, అడ్వంచర్స్‌, అండ్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌) నది శుభ్రతను భుజాన వేసుకుంది. 2012 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా 200 టన్నుల వ్యర్థాలను ఎత్తిపోసింది కొద్దిరోజులుగా ప్లాస్టిక్‌ నిషేధంపై విజయవాడలో సమరశంఖం పూరించారు. అయినా దాని వాడకాన్ని ప్రజలు ఆపిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. బందరు, ఏలూరు, రైవస్‌ కాల్వల్లో బయటకు తీసిన వ్యర్థాల్లో అధికర శాతం ప్లాస్టిక్‌ కనిపించింది. ముఖ్యంగా మురుగు నేరుగా నేరుగా కాల్వల్లోకి వచ్చి చేరుతోందని అధికారులు గమనించారు. దీనికి ముందుగా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించారు. రామలింగేశ్వరనగర్‌ కట్టకు ఎడమ వైపున ఉన్న ఇళ్లు, దుకాణాల నుంచి మురుగునీరు పైపుల ద్వారా బందరు కాల్వలోకి చేరుతోంది. ఏలూరు, రైవస్‌ కాల్వలోనూ ఇదే జరుగుతోందని గమనించారు. ఈ నీటిని తొలుతగా ఎస్టీపీ (సెకండరీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)కు మళ్లించి అక్కడ శుభ్రం చేసిన తర్వాత బయటకు వదిలితేనే కాల్వల రూపురేఖలు కొంతవరకు మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
 
కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం : కలెక్టర్‌
చుట్టుగుంట/పెనమలూరు రూరల్‌, మే 3 : కృష్ణమ్మ ప్రక్షాళనలో ప్రజలు, అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు మమేకమై కాలువలు, గట్టుల శుద్ధికి ఉత్సాహంగా కదిలి వచ్చారని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. కృష్ణానది ప్రక్షాళనలో భాగంగా జిల్లా యంత్రాంగం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ‘‘ నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో ’’ కార్యక్రమానికి రెండో రోజైన శుక్రవారం అనూహ్య స్పందన లభించింది. తొలుత అలంకార్‌ సెంటర్‌ నుంచి నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్‌తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్‌, జేసీ, జేసీ-2, తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏలూరు లాకుల సెంటర్‌ వద్ద నిర్వహించిన మానవహారంలో కలెక్టర్‌ పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. ఏలూరు లాకులు, బీఆర్టీఎస్‌ రోడ్డు, మీసాల రాజారావు బ్రిడ్జి, యనమలకుదురు కరకట్ట వద్ద ఎక్స్‌కవేటర్‌తో కాలువలో వ్యర్థాలు తొలగింపు కార్యక్ర మాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌, కలెక్టర్‌ పర్యవేక్షించారు. అరండల్‌పేటలో స్థానికులకు కరపత్రాలు పంపిణీ చేశారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ నగరాన్ని కాలుష్య బారి నుంచి తప్పించి శుభ్రంగా ఉంచేందుకు ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మూడు నెలల్లో ఒక పరిష్కారం కనుగొనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. రైవస్‌, ఏలూరు, బందరు కాల్వల్లో వ్యర్థాలు తొలగించాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో సర్వే చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, నదీ ప్రాంతాలను పరిరక్షించుకోవడానికి ప్రతిఒక్కరూ అంకితమవ్వాలని ఆయన కోరారు. వీఎంసీ కమిషనర్‌ ఎం.రామారావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాలు, రైవస్‌, ఏలూరు, బందరు కాల్వలు, గట్టులు వ్యర్థాలతో నిండిపోతున్నాయని ఇది నీటి కాలుష్యానికి దారి తీస్తాయని, ప్రజలు అనారోగ్యపాలవు తారన్నారు.
 
నగరంలో చెత్తను ప్రోసెస్‌ చేసి జీరో వేస్టుగా, వర్మి కంపోస్టుగా మార్చి మళ్లీ వినియోగించడానికి, మురుగు నీరు శుద్ధి చేసే డ్రైన్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థ పటిష్టపరిచేందుకు ప్రణాళికలలు రూపొందిస్తున్నామని కమిషనర్‌ పేర్కొన్నారు. జేసీ కృతికా శుక్లా మాట్లాడుతూ నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇరిగేషన్‌ ఎఫెక్స్‌ కమిటీ చైర్మన్‌ ఆళ్ల గోపాలకృష్ణ కలెక్టర్‌ను కలిసి కాలువల ప్రక్షాళనలో తమ వంతు సహకారం అందిస్తామన్నారు. జేసీ-2 పి.బాబురావు, డిప్యూటీ కలెక్టర్‌ చక్రపాణి, హౌసింగ్‌ పీడీ ధనుంజయుడు, డీపీవో రవీంద్ర, సాంఘికసంక్షేమ శాఖ జేడీ పీఎస్‌ఏ ప్రసాద్‌, దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీ నారాయణరావు, డీటీసీ మీరాప్రసాద్‌, వివిధ శాఖల సిబ్బంది, వీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. యనమలకుదురు కృష్ణా నదీ తీరంలో, అవనిగడ్డకు వెళ్లే కరకట్ట మార్గంలో చెత్త, వ్యర్థాలను తొలగించారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆయా శాఖల అధికారులతో కలసి యనమలకుదురు రామలింగేశ్వర స్వామి కొండ దిగువన ఉన్న కృష్ణా నదీ తీరాన్ని, అవనిగడ్డ కరకట్ట మార్గాన్ని పరిశీలించారు. అనంతరం యంత్రాల సాయంతో చెత్తను సింగ్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డుకు తరలించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *