రెరా చట్టం అమలులో సీఏల పాత్ర కీలకం


ఏపీ రెరా సభ్యుడు సాంబశివరావు
అమరావతి (ఆంధ్రజ్యోతి): స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి (రెరా) చట్టం-2016 ద్వారా ప్రభుత్వాలు ఆకాంక్షిస్తున్నట్లుగా రియాల్టీ రంగం క్రమబద్ధంగా, వినియోగ దారులకు ప్రయోజనం చేకూర్చగలిగేలా విస్తరించాలంటే ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్‌ స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి సాధికార సంస్థ (ఏపీ రెరా) సభ్యుడు చందు సాంబశివరావు అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా విజయవాడ శాఖ, ఏపీ రెరా కలసి ‘స్థిరాస్తి లావాదేవీలు- వర్క్‌ కాంట్రాక్ట్స్‌’ అనే అంశంపై విజయవాడలోని ఒక హోటల్‌లో గురువారంనాడు నిర్వహించిన ఒక రోజు సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. తొలుత ఈ సెమినార్‌ను కలెక్టర్‌ మహ్మద్‌ ఇంతియాజ్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ దేశంలో కాలానుగుణంగా మార్పులకు లోనవుతున్న పన్ను విధానాలపై పౌరుల్లో అవగాహన పెంచి, వారందరూ వాటిని పాటించేలా చేయాల్సిన బాధ్యత ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల (సీఏ)పై ఉందన్నారు. ఆ తర్వాత మాట్లాడిన సాంబశివరావు దేశ ఆర్ధికాభ్యున్నతిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న స్థిరాస్తి రంగ వ్యవహారాల్లో రెరా చట్టం కారణంగా సీఏలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. ‘రెరా’ చట్టంతో రియాల్టీ లావాదేవీలు శాస్త్రీయంగా, పారదర్శకంగా మారాయని చెప్పారు. ఈ చట్టంలోని వివిధ అంశాల గురించి వివ రించిన ఆయన దీనిని వినియోగ దారులతోపాటు ప్రమోటర్లు, బిల్డర్లు సరైన స్ఫూర్తితో అర్థం చేసుకుని, పాటించేలా చేయడంలో సీఏలు తమ పాత్రను సమర్ధంగా పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. ‘రెరా’ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత స్థిరాస్తులకు సంబంధించి వస్తుసేవల పన్ను (జీఎస్టీ)లో వచ్చిన మార్పుల గురించి హర్షవర్ధన్‌ వివరించారు.
 
రియాల్టీ వ్యవహారాల్లో ఆదాయపు పన్నులో చోటు చేసుకున్న మార్పులను ఇ.ఫల్గుణ కుమార్‌ తెలిపారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా విజయవాడ శాఖ అధ్యక్షురాలు వై.నాగవల్లి, కార్యదర్శి కె.పూర్ణచంద్రరావు ప్రభృతులు సదస్సును సమన్వయపరిచారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *