రేపటి కేబినెట్‌ భేటీపై సా..గుతున్న సస్పెన్స్‌


  • ఈసీ నుంచి ఇంకా రాని అనుమతి
  • నేడు రావొచ్చంటున్న సీఈవో కార్యాలయం
అమరావతి (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 14వ తేదీన జరుగుతుందా లేదా అనే దానిపై సస్సెన్స్‌ కొనసాగుతూనే ఉంది. కేబినెట్‌ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్ర్కీనింగ్‌ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేదికి పంపడం.. ఆయన శుక్రవారం మధ్యాహ్నం దానిని ఈసీకి నివేదించిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు ఎన్నికల కమిషన్‌ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఎన్నికల సంఘం అనుమతి కావాలంటే కనీసం 48 గంటల ముందు పంపాలని నిబంధనల్లో ఉంది. ఆదివారం సాయంత్రానికి 48 గంటలు దాటిపోయింది. సోమవారం దీనిపై ఈసీ స్పందించవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
 
ఆదివారం ఆరో విడత ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్నందున ఈసీ సిబ్బంది బిజీగా ఉంటారని.. సోమవారమే తమ ప్రతిపాదనపై అనుమతులు వచ్చే అవకాశాలున్నాయని సీఈవో కార్యాలయం వెల్లడించింది. ఒకవేళ సోమవారం మధ్యాహ్నం నాటికి కేబినెట్‌ భేటీకి అనుమతి వచ్చినా గంటల వ్యవధిలో మంత్రులకు సమాచారం చేరవేసి.. అధికారులను సిద్ధం చేసి సమావేశం నిర్వహించడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులందరూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి తమ కేడర్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేస్తున్నారు. ఈ వ్యవహారాల్లోనే తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారంలోగా వారంతా అమరావతి చేరుకోగలరా అనే కోణంలోనూ ఆలోచిస్తున్నారు. సమయం ఎక్కువ ఉండదు కాబట్టి అధికారులు కూడా హడావుడిగానే కేబినెట్‌ సమావేశం కోసం సిద్ధపడతారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *