రేపే నీట్‌


  • నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
  • మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష
  • తెలంగాణలో 5, ఏపీలో 6 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు
అమరావతి/హైదరాబాద్‌, మే 3(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్ష ఈ నెల 5(ఆదివారం) జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు సీబీఎస్‌ఈ ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్‌ పరీక్షను దేశ వ్యాప్తంగా 15.19 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. ఏపీ నుంచి 90 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఏపీలో విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో నీట్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో 13 నుంచి 15 కేంద్రాలను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించారు.
 
మే 5న ఆదివారం దేశవ్యాప్తంగా ఒకేసారి ఈ పరీక్షను నిర్వహిస్తారు. 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.30 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. 2 గంటలకు ప్రశ్నాపత్నం అందిస్తారు. 5 గంటలకు పరీక్ష పూర్తి అవుతుంది. పరీక్ష పూర్తి అయిన నెల రోజుల తర్వాత నీట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి.
 
తెలుగులోనే పరీక్ష
గత ఏడాది దేశ వ్యాప్తంగా 2,225 పరీక్షా కేంద్రాల్లో 13.26 లక్షల మంది విద్యార్థులు నీట్‌ రాయగా, ఈసారి 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కాగా, కొన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా అక్కడ పరీక్షా కేంద్రాల్లో మార్పులు చేశారు. మరోమారు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తెలిపింది. మూడు గంటల పాటు జరిగే నీట్‌లో 180 ప్రశ్నలకు 720 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులుంటాయి. తెలుగు విద్యార్థులకు స్థానిక భాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించారు.
 
బూట్లు ధరిస్తే వెనక్కే
  • ఆభరణాలతో పరీక్షా కేంద్రాలకు రాకూడదు
  • ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇయర్‌ ఫోన్లు, బ్లూటూత్స్‌ నిషేధం
  • గడియారాలు, బ్రేస్‌లెట్‌, కెమెరాలు కూడా తీసుకురావొద్దు
  • డ్రెస్‌కోడ్‌ పాటించాల్సి ఉంటుంది. హాఫ్‌ స్లీవ్‌, లాంగ్‌స్లీవ్స్‌తో కూడిన దుస్తులతోపాటు బూట్లను కూడా అనుమతించరు.
  • మంచినీళ్ల బాటిల్‌నూ అనుమతించరు. డయాబెటిస్‌ పేషెంట్లు ఉంటే ప్రత్యేక అనుమతితో అవసరమైన ఆహారం తీసుకెళ్లవచ్చు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *