రైలులో విద్యుత్‌ షాక్‌ ఘటనపై.. నేటి నుంచి విచారణ


  • సికింద్రాబాద్‌ నుంచి వస్తున్న ఐజీ స్థాయి అధికారుల బృందం
  • గుంటూరులో రెండు రోజులు కొనసాగనున్న విచారణ
  • బాధితుల వివరణ కోరిన డీఆర్‌ఎం
  • ఆ రైలు రాజమండ్రికి తరలింపు
తెనాలి: గుంటూరు-ఒంగోలు పాసింజర్‌ రైలులోని బోగీలో విద్యుత్తు షాక్‌ తగిలి ప్రయాణికులు గాయాలపాలయిన సంఘటనపై ప్రత్యేక విచారణ బృందం తమ విచారణను సోమవారం నుంచి మొదలు పెట్టనుంది. గుంటూరు నుంచి ఒంగోలు వెళుతున్న 67255 నెంబర్‌ పాసింజర్‌ రైలు శనివారం ఉదయం వేజండ్ల చేరుకునే సమయానికి విద్యుత్తు షాక్‌ తగిలిన సంగతి విదితమే. కొత్త ప్లాట్‌ఫారంపై ఆగిన రైలు నుంచి ఇంజన్‌ వెనుకనున్న బోగీలోకి ఎక్కేవారికి, దిగేవారికి షాక్‌ తగిలింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ప్రాణాపాయం లేకున్నా, ఈ సంఘటన రైల్వే వర్గాల్లో చర్చనీయంశమైంది. గతంలో ఇటువంటి సంఘటను ఎదురు కాలేదని గుంటూరు డీఆర్‌ఎం వీరవల్లి భూమా చెప్పారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు.ఈ సంఘటనకు సంబందించి రైలులో, వేజండ్ల ప్లాట్‌ఫారంపై గుంటూరు, విజయవాడ డివిజన్ల ఇంజనీరింగ్‌ నిపుణుల బృందాలు శనివారమే ప్రాథమిక విచారణ జరిపారు. అయితే దీనిపై సమగ్ర విచారణకోసం దక్షిణమధ్య రైల్వే ఐజీ స్థాయి అధికారులతో కూడిన బృందాన్ని నియమించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఈ బృందం సోమవారం గుంటూరు రానున్నారు. గుంటూరులోని డీఆర్‌ఎం ఆఫీసులో విచారణ మొదలుపెడతారని, ఈ విచారణ రెండు రోజులు కొనసాగుతుందని డీఈర్‌ఎం భూమా చెప్పారు.
 
ఈ సంఘటనలో గాయపడినవారుకానీ, అదే రైలులో ప్రయాణించి సంఘటనను ప్రత్యక్షంగా చూసినవారుకానీ నేరుగా డీఆర్‌ఎం కార్యాలయానికి వచ్చి విచారణ బృందం ముందు ఈ ఘటన గురించి వివరించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ప్రయాణికులు దయచేసి డీఆర్‌ఎం కార్యాలయానికి రావాలని కోరారు. ప్రధానంగా రైలు డ్రైవర్‌ తివారి, గార్డు రాజులను ప్రాథమిక విచారణ జరపనున్నారు. సంఘటన జరిగిన తీరును వీరి నుంచి తెలుసుకుని తర్వాతి విచారణను కొనసాగించనున్నారనేది సమాచారం. ఇదిట్లా ఉంటే, సంఘటనకు కారణమైన రైలును తెనాలి నుంచి ఆదివారం గుంటూరు తీసుకువెళ్లి, అక్కడి నుంచి రాజమండ్రి మెయింటినెన్స్‌ షెడ్‌కు పంపనున్నట్టు అఽధికారులు చెప్పారు. రైలు బోగీలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తామని, అప్పటికీ తేలకుంటే తమిళనాడులోని ఈరోడ్‌ కు పంపనున్నట్టు చెప్పారు. అయితే రాజమండ్రిలోనే అసలు కారణాలు తెలిసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని డీఆర్‌ఎం వ్యక్తం చేశారు. డెమూ రైళ్ల నిర్వహణలో లోపాలున్నాయంటూ వస్తున్న వార్తలపై ఈ బృందం ఎంతవరకు స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. ఈ సంఘటన వరకు మాత్రమే వారు విచారణ జరిపి చేతులు దులుపుకుంటే భవిష్యత్‌ల మరిన్ని సంఘటనలను చవిచూడాల్సి వచ్చే పరిస్థితి ఉంది. వస్తున్న విమర్శలకు తగ్గట్టుగానే నిజంగా ఈ రైళ్ల నిర్వహణలోపం వల్లే సంఘటన జరిగి ఉంటే మాత్రం మిగిలిన రైళ్లనుకూడా తప్పనిసరిగా పరిశీలించాల్సిందే. బృందం విచారణ ఆ ఒక్క సంఘటనకే ముడిపెట్టకుండా, మిగిలిన రైళ్ల పనితీరునుకూడా చూడాలని, ఒకవేళ ఈ సందర్బంలో వీలుకాని పక్షంలో విచారణ పూర్తయిన తర్వాత డెమూ రైళ్ల పరిస్థితిపై మరో కమిటీని వేయాలని జిల్లా రైల్వే ప్రయాణికుల సంక్షేమ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *