రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి


  • బస్సును తప్పించే ప్రయత్నంలో చక్రాల కింద చితికిన తల్లీబిడ్డలు
నగరి/మదనపల్లె, పెద్దారవీడు/ఒంగోలు, ఏప్రిల్‌ 18: రాష్ట్రంలో ఒక్కరోజే ఏడుగురు రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఐదుగురు మృత్యువాతపడ్డారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు యువతులు, నలుగురు యువకుల బృందం విహారయాత్రకు చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసనాథ కోన జలపాతానికి కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో నగరి మండలంలోని వీకేఆర్‌ పురం వద్ద కారు అదుపు తప్పింది. రోడ్డుపై పల్టీలు కొట్టింది. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. వారిని కాంచీపురం ఒరగడంకు చెందిన ఎంజిత్‌(24), గుడువాంజేరి కార్తీక్‌నగర్‌కు చెందిన ప్రతుల్‌రాజ్‌(19), చెన్నై పోరూరుకు చెందిన ప్రేమ్‌(25)గా గుర్తించారు. ఇదే జిల్లా మదనపల్లె మండలంలో జరిగిన మరో రోడ్డుప్రమాదంలో తల్లీబిడ్డ చనిపోయారు. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.
 
రామసముద్రానికి చెందిన కార్పెంటర్‌ నారాయణస్వామి(36) తన భార్య శివమ్మ(28), మూడేళ్ల కుమారుడితో కలసి ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలుదేరాడు. బొమ్మనచెరువు మలుపు వద్ద ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో నారాయణస్వామి తన వాహనాన్ని మట్టిరోడ్డులోకి దింపాడు. ఇసుక, కంకర ఎక్కువగా ఉండడంతో అది అదుపుతప్పి బోల్తాపడింది. శివమ్మ, బాలుడు నడిరోడ్డుపై ఎగిరిపడగా, వారిపైగా ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్రకాశం జిల్లా గొబ్బూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు తాపీకూలీలు చనిపోయారు. వేగంగా వస్తున్న టాటాఏస్‌.. మోటారు సైకిల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *