రోహిత్‌ భార్యపై పోలీసుల అనుమానం!


  • వారి వైవాహిక జీవితంలో కలతలు
  • రోహిత్‌ శేఖర్‌ తల్లి ఉజ్వల వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 : ఏపీ మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్‌ శేఖర్‌ హత్య కేసులో ఆయన భార్య అపూర్వ పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. అతని మరణంలో ఇంట్లోని ఓ వ్యక్తి పాత్ర ఉందని ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు నమ్ముతున్నారు. శనివారం అపూర్వను వారు గుచ్చిగుచ్చి ప్రశ్నలడిగారు. అస్వస్థతకు గురయ్యారంటూ రోహిత్‌ను ఈ నెల 16న ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి అపూర్వే తీసుకెళ్లింది. అయితే, అప్పటికే రోహిత్‌ చనిపోయాడ ని డాక్టర్లు చెప్పారు. ఆయన హత్యకు గురయ్యాడని పోస్టుమార్టం నివేదిక ధ్రువీకరించింది.
 
నిరుడు ప్రేమ వివాహం
రోహిత్‌ వైవాహిక జీవితం సాఫీగా లేదని, పెళ్లయిన తొలిరోజు నుంచీ వారిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారని తల్లి ఉజ్వల పేర్కొన్నారు. ప్రేమ వివాహం అయినా వారి మధ్య సఖ్యత లేదన్నారు. తాను రాజకీయంగా ఎదగలేకపోతున్నానన్న కుంగుబాటు తన కుమారుడిలో కనిపించేదని తెలిపారు. ‘‘ఈ నెల 11న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరం ఓటు వేశాం. మరునాడు రాణిబాగ్‌లో తన తండ్రి సమాధిని సందర్శించాడు. అక్కడి నుంచి 15న (మంగళవారం) ఢిల్లీకి వచ్చాం. వాడు తన ఇంటికి వెళ్లాడు. ఫోన్‌ చేస్తే అలసిపోయి నిద్రపోతున్నాడని అపూర్వ చెప్పింది. ఈమధ్యే రోహిత్‌కు బైపాస్‌ సర్జరీ అయింది.
 
దాంతో విశ్రాంతి తీసుకొంటున్నాడని అనుకొన్నాను’’ అని ఉజ్వల గుర్తు చేసుకొన్నారు. మరునా డు ఎప్పుడు ఫోన్‌ చేసినా నిద్రపోతున్నాడన్న సమాధానమే అపూర్వ ఇచ్చిందన్నారు. సాయంత్రం నాలు గైనా ఆయనను ఎందుకు లేపలేదన్నది తన సందేహమన్నారు. 2007లో రోహిత్‌కు తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పట్నుంచి డాక్టర్‌ సుమిత్‌ సేథీ ఆయనకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. బైపాస్‌ అయ్యాక విశ్రాంతి అవసరమని డాక్టరు కూడా చెప్పారు.
 
బుధవారం సాయంత్రం 4 గంటలకు రోహిత్‌ ఇంటి పని మనిషి ఫోన్‌ చేశాడు. ఆయన రక్తం కక్కుకొని అపాయకర స్థితిలో ఉన్నట్టు డాక్టర్‌కు సమాచారం ఇచ్చాడు. నేను కూడా రెగ్యులర్‌ చెకప్‌ కోసం మాక్స్‌ ఆసుపత్రిలో ఉన్నాను. నేను వెంటనే అంబులెన్స్‌ తీసుకొని వెళ్లేటప్పటికే రోహిత్‌ను కారులో ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో అపూర్వ ఉంది. నేను చివరిదాకా నా కోడలు మాటే నమ్మాను’’ అని ఉజ్వల ఆవేదన వ్యక్తం చేశారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *