లంచగొండి ఓటర్లను శిక్షించాలంటున్న పిటిషన్‌పై 22న విచారణ


న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో చట్టవిరుద్ధంగా ప్రవర్తించే ఓటర్లను విచారించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీ)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ జరుపుతుంది. కర్ణాటకలోని లంచ ముక్త కర్ణాటక నిర్మాణ వేదికె ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
 
ఓటు వేయడానికి డబ్బు, ముడుపులు అడగడం, తీసుకోవడం నేరమని పిటిషన్ పేర్కొంది. పోలింగ్ బూత్‌లో వేరొక వ్యక్తిగా అభినయించి ఓటు వేయడానికి ప్రయత్నించడం కూడా నేరమేనని తెలిపింది. ఆ వ్యక్తి ఆ విధంగా ఓటు వేయడంలో విజయం సాధించాడా? లేదా? అనే అంశంతో సంబంధం లేదని పేర్కొంది.
 
రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం అధికారాలను ఈసీ వినియోగించాలని, ఎన్నికల సంబంధిత దుష్ప్రవర్తన, చట్ట విరుద్ధ ప్రవర్తనకు పాల్పడే ఓటర్లను విచారించాలని పోలింగ్ సిబ్బందిని ఆదేశించాలని  కోరింది.
 
ఓటర్లు తాము లంచాలు పుచ్చుకుని ఓ వ్యక్తికి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఓటు వేయడానికి స్వేచ్ఛ ఉందని భావించినంత కాలం ఈసీ ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, న్యాయమైన, స్వేచ్ఛతో కూడిన ఎన్నికలు సాధ్యం కాదని తెలిపింది. పార్లమెంటు ఆమోదించిన ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం ఈసీకి అధికారాలు ఉన్నాయని, ఓటర్ల ప్రేరేపిత మోసాలకు ఓటర్లను శిక్షించే నిబంధనలను ఈసీ అమలు చేయకపోతే, అవన్నీ తలక్రిందులవుతాయని ఆరోపించింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *