లాజిస్టిక్‌ను.. ముంచేశారు!


‘గ్యాలెక్స్‌’ విరమణ వెనుక ఇంటిదొంగలు
 
ఆర్టీసీ ‘లాజిస్టిక్‌ ’ విభాగాన్ని కొందరు పర్యవేక్షకులు లాజిక్‌గా ముంచేశారు. ఈ వ్యవస్థను వారి అక్రమ సంపాదనకు మార్గంగా ఎంచుకున్నారు. వీరి తీరుతో లాజిస్టిక్‌ను నిర్వహిస్తున్న గ్యాలెక్స్‌ సంస్థ అర్ధాంతరంగా విరమించుకుంది. ఆర్టీసీ సిబ్బంది, ప్రైవేట్‌ సంస్థ సిబ్బంది ఏకమై ‘నెట్‌వర్క్‌’ ఏర్పరచుకుని సంస్థకు వచ్చే ఆదాయాన్ని వారి ఖాతాల్లోకి మళ్లించుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. లాజిస్టిక్‌ విభాగంలో నిఘా పెట్టి కొందరిని పట్టుకున్నా చర్యలు నామమాత్రంగా ఉండటంతో.. కొందరు పర్యవేక్షకులు మరింత ధీమాగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడటంతో ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఆర్టీసీ ఆపరేషన్‌ విభాగంలో ‘లాజిస్టిక్‌’ సర్వీసును రెండేళ్ల క్రితం ప్రారంభించారు. ఇది బంగారు బాతు అని.. ‘ఆర్టీసీ’ కి అర్థమైంది. లాజిస్టిక్‌ను విస్తరించి అది పెద్ద ‘కార్గో’ దిశగా నడవడానికి ఈ రెండేళ్లూ ఎంతో శక్తిని ఇచ్చింది. లాజిస్టిక్‌ విభాగాన్ని ఆర్టీసీనే పర్యవేక్షిస్తున్నా, నిర్వహణకు ప్రైవేటు ఏజన్సీ సేవలు తీసుకుంది. ‘గ్యాలెక్స్‌ ’ సంస్థ ఆర్టీసీ లాజిస్టిక్‌లోకి అడుగు పెట్టింది. మూడేళ్ల కాల పరిమితితో ఈ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీనికి ఏడాది గడువున్నా తాను లాజిస్టిక్‌ నిర్వహణ నుంచి తప్పుకుంటున్నట్టు ఆర్టీసీ యాజమాన్యానికి ఆ సంస్థ తెలియజేసింది. ఇది ఎందుకిలా చేసిందన్న దానిపై లోతుగా వెళ్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లాజిస్టిక్‌ను పర్యవేక్షించే ఆర్టీసీ ఉన్నతాధికారుల వైఫల్యం కారణంగా ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్శ విమర్శలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో లాజిస్టిక్‌ను ఆర్టీసీ నిర్వహించి ఉంటే మరోలా ఉండేది. పర్యవేక్షణ ఆర్టీసీ, నిర్వహణ ప్రైవేటు అనే విధానాలతో ముందుకెళ్లడంతో ఆర్టీసీ, ప్రైవేటు సిబ్బంది కలిసిపోయి ఏకంగా సంస్థ గుండెకే చిల్లులు పెట్టేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్యాలెక్స్‌ సంస్థ అర్ధాంతర విరమణ వ్యవహారం వెనుక ఇవి ఆరోపణలు కాదని, వాస్తవాలేనని ధ్రువపడుతోంది. ఇంతకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవాలేనని తెలుస్తోంది.
 
 
లాజిస్టిక్‌ విభాగంలో క్లయింట్స్‌ ఆర్డర్స్‌ కీలకం. ఆర్టీసీ లాజిస్టిక్‌ విభాగం అత్యంత వేగవంతమైనదన్న పేరు పొందింది. సంస్థలో వందలాది బస్సులు ఉంటాయి. దూర ప్రాంతాలకు నిర్ణీత సమయంలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. హైదరాబాద్‌కు పార్సిల్‌ పంపించినా ఐదారు గంటల్లో చేరిపోతుంది. ఇంత సత్వర బట్వాడా వ్యవస్థ మరే ప్రైవేటు సంస్థకు లేదు. దీన్ని బయటి వ్యాపార సంస్థలు బాగా గుర్తించాయి. దీంతో లాజిస్టిక్‌ విభాగాన్ని పర్యవేక్షించే కొందరితో వ్యాపార సంస్థలు ఈ క్రమంలో సంబంధాలు పెట్టుకుంటున్నాయి. దాదాపుగా అన్ని చోట్లా పరిస్థితి ఇలాగే తయారైంది. విజయవాడలో ఇది ఎంత వరకు వచ్చిందంటే తాము సంబంధాలు పెట్టుకున్న ఆర్టీసీ పర్యవేక్షకుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేసే పరిస్థితికి దారి తీసింది. కొందరు పర్యవేక్షకులతో, వ్యాపారులు ఫోన్‌లోనే లావాదేవీలు నడిపే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో కొందరు పర్యవేక్షకుల్లో దుర్భుద్ధి పుట్టింది. అక్రమ సంపాదనకు మార్గంగా దీన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో గ్యాలెక్స్‌ సంస్థ నియమించిన ప్రైవేటు సిబ్బందితో వీరు చేతులు కలిపారు. ఇలా వ్యాపారుల నుంచి వస్తున్న ఆర్డర్స్‌లో కొంత లాజిస్టిక్‌లో చూపడం, మిగిలినది చూపకుండా రవాణా చేయడం వంటివి గుట్టు చప్పుడు కాకుండా నడిపించేస్తున్నారు. ఈ వ్యవహారంలో పర్యవేక్షకులు.. కొందరు డ్రైవర్లను . పావులుగా వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. పర్యవేక్షకుల్లో కొందరు పెద్ద నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
 
వారిదే బాధ్యత
తమతో సంబంధం లేకుండా థర్డ్‌పార్టీ సంస్థలు నేరుగా లాజిస్టిక్‌ విభాగం ద్వారా బట్వాడా చేయటానికి వస్తే.. ఆ సరకు ఏమిటో తెలుసుకుని విలువైనవైతే వాటిని మాయం చేస్తున్నారు. సరకు రాలేదని గగ్గోలు పెడితే ఆర్టీసీ అధికారులు నిర్వహణ సంస్థను బాధ్యులను చేస్తోంది. దీంతో మాయమైన పార్సిల్స్‌కు నష్టపరిహారాన్ని ‘గ్యాలెక్స్‌ ’ సంస్థ చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటివి నిర్వహణ సంస్థకు భారంగా మారుతున్నాయి.
 
మొక్కుబడి చర్యలు
విజయవాడలో ఇలాంటి వ్యవహారాలు చేస్తున్న ఒక రాకెట్‌ను ఆర్టీసీ యాజమాన్యం కొంత కాలం కిందట రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. సీసీ కెమెరాలతో అనుమానితులపై నిఘా వేసింది. దీనిలో ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల పాత్ర బయటపడింది. ఇళ్లల్లో సోదాలు చేయగా మాయమైన వస్తువులు లభించాయి. పర్యవేక్షకుడిని బదిలీ చేసి సరిపెట్టేశారు. అంతకు మించి చర్యలు లేకపోవడంతో ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో మరింత మంది పర్యవేక్షకులు పేట్రేగిపోతున్నారు. అంతేకాకుండా బదిలీ అయిన ఆ ఉద్యోగి ఎంచక్కా తన విధులు ముగించుకున్న తర్వాత లాజిస్టిక్‌ విభాగంలో ప్రత్యక్షమౌతున్నాడన్న విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. గ్యాలెక్స్‌ సంస్థ అర్ధాంతరంగా తప్పుకోవడంతో, గతిలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉన్నతాధికారులు టెండర్లు పిలిచినా స్పందన రావడం లేదని తెలుస్తోంది.
 

నెట్‌వర్క్‌ ద్వారా .. తరలించేస్తారు
విజయవాడ నుంచి విశాఖపట్నం పార్సిల్స్‌ రవాణా చేస్తుంటారు. వాస్తవానికి విజయవాడలో బిల్లు జనరేట్‌ అవుతుంది. ఆన్‌లైన్‌లో దాని పరిమాణం కూడా జనరేట్‌ అవుతుంది. విశాఖపట్నానికి ఆ పార్సిల్‌ వెళ్లినప్పుడు దాని పరిమాణం కూడా అక్కడ వారికి తెలిసి పోతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పర్యవేక్షకులు ఏర్పరచుకున్న నెట్‌వర్క్‌ కారణంగా అక్కడి వారికి సమాచారం వెళ్లిపోతుంది. అక్కడి వారు సరకును జాగ్రత్తగా దింపిస్తారు. దీంతో సంస్థకు చెందాల్సిన సొమ్మును పర్యవేక్షకులు తమ ఖాతాల్లోకి వేసుకుంటున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *