లోకల్‌ వార్‌!


  • కార్పొరేటర్లకు, స్థానిక ఎమ్మెల్యేలకు పెరుగుతున్న దూరం
  • ఎన్నికల్లో తమకు పని చేయలేదని అనుమానం
  • స్థానిక నేతల అండ కోరుతున్న కార్పొరేటర్లు
  • కొత్త ముఖాలను తెచ్చేందుకు ఓ ఎమ్మెల్యే ప్రయత్నాలు
  • పాతవారినే కొనసాగించేందుకు ఇద్దరు నేతల పట్టు
  • స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముదురుతున్న పోరు
(ఆంధ్రజ్యోతి విజయవాడ): స్థానిక ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేళ విజయవాడ నగరంలోని అధికార పార్టీ కార్పొరేటర్లకు.. స్థానిక ఎమ్మెల్యేలకు నడుమ దూరం పెరుగుతోంది. ఇటీవల ఎన్నికల్లో తమకు పనిచేయకుండా చేయిచ్చిన కార్పొ రేటర్లను పక్కనపెట్టి తమ వర్గం వారికి కార్పొరేటర్లుగా టికెట్లు ఇప్పించుకోవాలని ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ప్రారంభించడం కార్పొరేటర్లలో గుబులు పెంచుతోంది. నగర పరిధిలోని ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు అందరినీ మార్చేసి, తనకు అను కూలురైన వారికి టికెట్లు ఇప్పించుకోవాలని భావిస్తున్నారు. ఇంకో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే.. తన నియోజకవర్గం పరిధిలో సగం మంది కార్పొరేటర్లను మార్చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ పరిణామాలతో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌ కార్పొరేటర్లు బెంబేలెత్తి పోతున్నారు. టికెట్‌ వస్తుందన్న ధీమాతో ఉన్నవారు ఓ వర్గంగాను.. రాదన్న భయం ఉన్న వారు మరో వర్గంగాను ఏర్పడ్డారు. ఎలాగైనా టికెట్‌ దక్కించుకునేందుకు తమకు అనుకూలురైన స్థానిక నాయకుల వద్దకు చేరి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్న మయ్యారు. విజయవాడ నగర పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో కార్పొరేషన్‌ విస్తరించి ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 20 డివిజన్లు, విజయవాడ సెంట్రల్‌ పరిధిలో 20 డివిజన్లు, విజయవాడ తూర్పు పరిధిలో 19 డివిజన్లు ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో టీడీపీకి 37 మంది కార్పొరేటర్లు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు.. కార్పొరేటర్లకు పొసగకపోవడం వల్ల రానున్న స్థానిక సమరంలో వీరిలో అధికశాతం మందికి టికెట్లు దక్కవన్న ప్రచారం జరుగుతోంది.
 
పనిచేయించుకుని ఇలా చేస్తారా..
ఎన్నికల వరకు తమతో పనిచేయించుకుని ఇప్పుడు తమను పరాయివారిగా చూడటం ఏమిటని ఎమ్మెల్యేపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాత్రం.. ఎన్నికల సమయంలో తనకు ఎవరు పనిచేశారో.. ఎవరు చేయలేదో మొత్తం సమాచారం తన వద్ద ఉందని, కార్పొరేటర్లు సరిగా సహకరించకపోవడం వల్లే ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలు అన్ని పనులు తన బంధువుల ద్వారానే చేయించుకోవాల్సి వచ్చిం దని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేటర్ల వాదన మాత్రం వేరేలా ఉంది. ఎమ్మెల్యే చుట్టూ ఉన్న కోటరీ వల్లే ఆయనకు తమపై అపనమ్మకం పెరిగిపోయిందని, రాను న్న ఎన్నికల్లో టికెట్లు దక్కించుకునేం దుకు ఆ కోటరీలోని వ్యక్తులు ఇలాంటి కుట్ర లు పన్నుతున్నారని కార్పొరేటర్లు వాపోతున్నారు.
 
అక్కడా అదే పరిస్థితి..!
నగరంలోని మరో నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా తన పరిధిలోని సగం మంది కార్పొరేటర్లను మార్చాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇక్కడ కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్లు తనకు కాకుండా తన ప్రత్యర్ధి గెలుపు కోసం పనిచేశారన్నది ఆయన ఆరోపణ.
 
అయితే ఈ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చెప్పిందే వేదం కావడంతో తమ టికెట్లను కాపాడుకునేందుకు ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక కార్పొరేటర్లు తీవ్రంగా మధనపడుతున్నారు. చేసేది లేక ఎమ్మెల్యే చెంతకు చేరి.. తాము ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ఏ విధంగా కృషి చేశామో.. బూతులవారీగా ఎన్ని ఓట్లు వేయించామో లెక్కలు వేసి మరీ చెబుతున్నారు.
 
గరం.. గరం.. రాజకీయం..!
నగరంలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని 20 మంది కార్పొరేటర్లను మార్చేసి కొత్తవారికి టికెట్లు ఇప్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తన నియోజకవర్గంలోని కార్పొరేటర్లు.. స్థానికంగా ఉండే ఇద్దరు నేతలతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నది ఆయన అభిప్రాయం. తన నియోజక వర్గంపై పట్టు బిగించాలంటే మొత్తం కార్పొరేటర్లను మార్చేసి తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోక తప్పదన్నది ఆయన నిశ్చితాభిప్రాయంగా ఉంది. అందులో భాగంగా తన నియోజకవర్గ పరిధిలోని సిట్టింగ్‌ కార్పొరేటర్ల అవినీతి చిట్టాలను ఆయన సిద్ధం చేసి అధిష్ఠానానికి అందించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సదరు ఎమ్మెల్యే వద్ద ఉండే కోటరీ సిట్టింగ్‌ కార్పొరేటర్ల అవినీతి చిట్టాలను రెడీ చేసే పనిలో నిమగ్నమై ఉంది. మరీ ముఖ్యంగా ఓ సీనియర్‌ కార్పొరటర్‌పై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. ఇటీవల జరిగిన సాధా రణ ఎన్నికల్లో కొందరు కార్యకర్తల్ని ఆ కార్పొరేటర్‌ ప్రతిపక్ష పార్టీలోకి పంపారని, తనకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రోత్సహిం చారని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు ముందు కార్పొరేటర్లు ఎవ్వరూ తనకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఈ ఎమ్మెల్యే.. కార్పొ రేటర్లతో వారి పిల్లలపై ప్రమాణాలు కూడా చేయించుకున్నారన్న ప్రచారం జరిగింది. దీ నిపై అప్పట్లో కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంత చేసి కూడా తమను అనుమానించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు అందరూ స్థానికంగా పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు నేతల వద్దకు చేరి తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సదరు నేతలు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కష్టపడి పార్టీకోసం పనిచేసిన వారందరికీ టికెట్లు వస్తాయని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *