వర్మకు పోలీసుల చెక్‌!


  • బెజవాడలో ప్రెస్‌మీట్‌కు నిర్ణయం
  • కోడ్‌ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులు
విజయవాడ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు విజయవాడ పోలీసులు చెక్‌ పెట్టారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో విజయవాడకు వచ్చిన ఆయనను పోలీసులు తిరిగి ఎయిర్‌పోర్టుకు పంపేశారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరుతో ఆయన సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌లో బ్రేక్‌ పడింది. తాజాగా మే ఒకటిన విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ వివరాలు చెప్పడానికి ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు. నోవాటెల్‌ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ ఉంటుందని ప్రకటించారు. తర్వాత దాన్ని హోటల్‌ ఐలాపురానికి మార్చారు. కొద్దిసేపటికే అజిత్‌సింగ్‌నగర్‌లోని పైపులరోడ్డు జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహిస్తానని వర్మ తెలిపారు. చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డితో కలిసి రాంగోపాల్‌ వర్మ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అయినా కారులో పైపులరోడ్డుకు బయలుదేరారు. ఈ సమాచారాన్ని విమానాశ్రయ పోలీసులు సిటీ పోలీసులకు చేరవేశారు.
 
దీంతో రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద పోలీసులు వర్మ కారును అడ్డుకున్నారు. కారులో నుంచి ఇద్దరినీ దింపేసి మరో కారులో తిరిగి విమానాశ్రయానికి పంపేశారు. అక్కడి నుంచి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విశేషాలు చెప్పడానికి వచ్చాను. పోలీసులు బలవంతంగా నన్ను, నిర్మాతను కారు దింపేసి, తీసుకొచ్చి ఎయిర్‌పోర్టులో పడేశారు. శాంతిభద్రతలు పోలీసుల బాధ్యతే. అలాగని మేం విజయవాడలో ఉండటానికి వీల్లేదని చెబుతున్నారు. ఇదెక్కడ విచిత్రమో!. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో ఉన్నాం. అప్‌డేట్స్‌ చెప్పడానికి ప్రయత్నిస్తా’ అని వీడియోలో వర్మ మాట్లాడారు. కాగా, వర్మను అడ్డుకోవడానికి గల కారణాలను పోలీసులు ఉత్తర మండలం సహాయ కమిషనర్‌ రమేశ్‌ వివరించారు. ‘బెజవాడలో ఎన్నికల కోడ్‌తోపాటు సెక్షన్‌ 30, 144 అమల్లో ఉన్నాయి. వర్మ ఈ సమావేశంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా.. ప్రశాంత వాతావరణం చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి’ అని రమేశ్‌ పేర్కొన్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *