వానాకాలంలోగా నిర్మాణాలు


  • ప్రాధాన్యక్రమంలో రాజధాని నిర్మాణ పనులు: సీఎం
అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): రాజధానిలో జరుగుతున్న నిర్మాణాలను ప్రాధాన్యక్రమంలో గుర్తించి, తొలి వరుసలో ఉన్న వాటిని వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో చేపట్టిన వివిధ పనుల పురోగతిని గురువారం ఆయన ఏపీసీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షించారు. నూతన శాసనసభ కొలువుదీరిన వెంటనే ఎమ్మెల్యేలు రాజధానిలో ఉండేందుకు వీలుగా నివాస భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిని ఇతర ప్రాంతాలకు అనుసంధానించే రహదారుల్లో న్యాయ వివాదాల్లేని వాటిని వేగంగా పూర్తి చేయాలన్నారు.
 
ఇవి సిద్ధమైతే, రాజధానికి ఒక సమగ్రమైన ఆకృతి వస్తుందని, అమరావతికి రాకపోకలు పెరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్‌ అధికారుల భవనాలు, గెజిటెడ్‌ అధికారులు, ఉద్యోగుల నివాస భవనాలు ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీనాటికి, మంత్రులు, జడ్జిలు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల కోసం నిర్మిస్తున్న బంగళాలు ఆగస్టు 16కల్లా సిద్ధమవుతాయన్నారు. సచివాలయం, విభాగాధిపతుల టవర్లు వచ్చే ఏడాది జూలై 18నాటికి, హైకోర్టు ఐకానిక్‌ భవన నిర్మాణం తొలి దశ వచ్చే ఏడాది సెప్టెంబరు 28కల్లా పూర్తవుతాయని వివరించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *