వారణాసిలో ప్రియాంక పోటీపై అహ్మద్ పటేల్ ఏమన్నారంటే…


న్యూఢిల్లీ: యూపీలోని ప్రతిష్ఠాత్మక వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీపై తూర్పు యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీలోకి దిగే విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వివరణ ఇచ్చారు. పార్టీ కోరితే తప్పనిసరిగా పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రియాంక చెప్పారని, దీనిపై పార్టీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందరితో సంప్రదించి ప్రియాంక పోటీపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
 
అమేథీ, రాయబరేలిలో పార్టీ తరఫున విస్తృత ప్రచారం సాగిస్తున్న ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలోనూ సుముఖంగానే ఉన్నానంటూ ఇటీవల సంకేతాలిచ్చారు. రాయబరేలీలోలో సోనియాగాంధీ స్థానంలో పోటీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు అంటూ ఆమె నవ్వుతూ సమాధానం ఇవ్వడంతో మోదీకి ప్రత్యర్థిగా ఆమె బరిలోకి దిగుతారనే సంకేతాలు వెళ్లాయి. అయితే, మోదీపై పోటీ అంత సులువు కాదని, ప్రతికూల ఫలితం వస్తే పార్టీకి ఇబ్బందులు తలెత్తవచ్చని కొందరు సూచిస్తుండగా, కాంగ్రెస్‌ పార్టీలోని మరోవర్గం మాత్రం ప్రియాంక అయితేనే మోదీకి గట్టి పోటీ ఇవ్వగలరని చెబుతున్నారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఒకటి రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 26న వారణాసి నుంచి మోదీ నామినేషన్ వేయనున్నారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *