వారాణసీలో ప్రజాస్వామ్యం అపహాస్యం


  • ఇందూరు రైతులకు అడుగడుగునా అడ్డంకులు
  • నామినేషన్ల దాఖలుకు నానా పాట్లు
  • గంట ఆలస్యంగా విధుల్లోకి అధికారులు
  • చలానాల జారీలో ఉద్దేశ్యపూర్వక ఆలస్యం
  • ఎట్టకేలకు.. మోదీపై 25 మంది పోటీ
ఆర్మూర్‌, ఏప్రిల్‌ 29: వారాణసీలో ప్రజాస్వామ్యం అపహాస్యంపాలైంది. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరినా ఫలితం లేకపోవడంతో.. ప్రధానిపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి, తమ నిరసనను తెలియజేయాలనుకున్న నిజామాబాద్‌ రైతులను అడ్డుకునేందుకు అన్ని శక్తులూ పనిచేశాయి. మోదీసేన (బీజేపీ నేతలు) ఒకవైపు.. పోలీసులు, కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) మరోవైపు.. ఎన్నికల అధికారులు ఇంకోవైపు.. రైతుల ప్రయత్నాలపై ముప్పేట దాడి జరిగింది. ఆదివారం దాకా బీజేపీ నేతలు, పోలీసులు, ఐబీ దాడులతో బెంబేలెత్తించగా.. సోమవారం పోలీసులు, ఎన్నికల అధికారులు కలిసికట్టుగా నామినేషన్లు దాఖలు చేసిన రైతులను అనర్హులుగా ప్రకటించే ఎత్తుగడ వేశారు. అయినా.. స్థానిక మీడియా.. న్యాయవాదుల సహకారంతో పాతిక మంది రైతులు విజయవంతంగా నామినేషన్లు వేశారు. ఉదయం 10 గంటలకే ప్రారంభమవ్వాల్సిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని..
 
తీరిగ్గా 11 గంటలకు తెరిచారు. నామినేషన్‌ ఫీజు రూపంలో అందజేయాల్సిన చలాన్ల విషయంలోనూ అధికారులు రైతులను ఇబ్బంది పెట్టారు. క్యూలో నిలబడ్డా.. వెంటనే చలానాలు ఇవ్వలేదు. అలా.. ఓ పది మంది రైతులు సమయాభావం వల్ల నామినేషన్లు వేయలేకపోయారు. మరో 25 మంది రైతులు మాత్రం ఎట్టకేలకు నామినేషన్లు దాఖలు చేశారు. అప్పటికీ పోలీసులు వారిని ఇబ్బందులకు గురిచేశారు. వారు ప్రతిపాదకులతో కలిసి నామినేషన్‌ వేయడానికి వెళ్లగా.. ‘‘వారితో అవసరం లేదు.. మీరు వెళితే చాలు..’’ అని పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో.. నామినేషన్‌ పత్రాలపై ప్రతిపాదకులు సంతకాలు చేయకుండా పోలీసులు బెదిరింపులకు దిగారు. లోపలికి వెళ్లాక.. రిటర్నింగ్‌ అధికారి మాత్రం.. ‘‘ప్రతిపాదకులు ఉండాల్సిందే’’ అని డిమాండ్‌ చేశారు. తమను ఇక్కట్లపాలుచేసిన అధికారుల వైఖరిని నిరసిస్తూ పసుపు రైతులు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కలెక్టర్‌ నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనను విరమించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *