విధివంచితులు


  • ఐఈఆర్‌టీల దీనావస్థ
  • డీఎస్సీలో అవకాశాల కోసం వేడుకోలు
  • వెయిటేజీ ఇవ్వాలని వినతులు
ఆంధ్రజ్యోతి, విజయవాడ : దివ్యాంగుల వైకల్యాన్ని రూపుమాపి.. ఎంతోమందిని తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్ది.. పాఠాలు చెప్పిన ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ టీచర్స్‌ (ఐఈఆర్‌టీ)కు ఉద్యోగావకాశాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఒకవైపు తమ దగ్గర పాఠాలు నేర్చుకున్నవారే ఎదిగి ప్రభుత్వ శాఖల్లో కొలువులు సాధిస్తుంటే, మరోవైపు తమ జీవితాలు దినదినగండంగా మారిపోతుంటే ఏం చేయాలని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఎప్పటికైనా స్కూల్‌ అసిస్టెంట్‌లు కాకపోతామా.. అని ఎదురుచూస్తున్నారు. అర దశాబ్దం కిందట డీఎస్సీ వచ్చింది. ఈలోపు వయస్సు పైబడింది. ఈ నేపథ్యంలో డీఎస్సీలో తమకు వెయిటేజీ కల్పించాలని ఐఈఆర్‌టీలు కోరుతున్నారు.
 
వెయిటేజీ కల్పించండి
సరిగ్గా చూడలేని, వినలేని, మానసిక స్థితి సరిగ్గా లేని, నిలబడలేని, కూర్చోలేని పిల్లలకు పాఠాలు బోధించటం ఐఈఆర్‌టీల విధి. ఇది కత్తిమీద సాము అని తెలిసినా ఎంతోమంది బీఈడీ, డీఈడీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసినవారు ఐఈఆర్‌టీలుగా పనిచేయటానికి ఆసక్తి చూపారు. ప్రవేశ పరీక్షలు రాసి ఎంపికయ్యారు. కాంట్రాక్టు విధానమే అయినా.. ఎప్పటికైనా రెగ్యులర్‌ కాకపోతామా? అనే ఆశతో వచ్చారు. స్కూల్‌ అసిస్టెంట్‌లు కాలేకపోతామా అనే భావనతో 17 ఏళ్లుగా ఇదే వృత్తిలో పనిచేస్తున్నారు. సాధారణ టీచర్ల కంటే వేతనాలు తక్కువే అయినా తాము రెగ్యులర్‌ కాలేకపోతామా అని దాదాపు దశాబ్దకాలంగా ఎదురు చూశారు. ఇలాంటి తరుణంలో 2012లో డీఎస్సీ వస్తుందనగా, వారిలో ఆనందం వెల్లివిరిసింది. అదీ మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఈలోపు రాష్ట్ర విభజన జరిగింది. 2019లో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఐఈఆర్‌టీలు డీఎస్సీలో తమ అవకాశాలను పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అయితే, వీరికి మరో సమస్య ఎదురైంది. దాదాపు 17 ఏళ్ల నుంచి ఇదే వృత్తిలో ఉండటం, అవకాశాలు రాకపోవటంతో వయోపరిమితి అడ్డొచ్చింది. డీఎస్సీకి 44 సంవత్సరాల వయోపరిమితి కాగా, 50 సంవత్సరాలు దాటినవారు టీచర్లుగా ఉన్నారు. వయోపరిమితికి సంబంధించి వీరి పోరాటం ఫలించినా, జీవో విడుదల కాలేదు. ఇదే సందర్భంలో తమకు అందరిలాగే 25 శాతం వెయిటేజీ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వెయిటేజీ లేకపోతే డీఎస్సీ-2019లో తమకు అవకాశాలు ఉండవని ఆందోళన చెందుతున్నారు.
 
పదిహేడేళ్లుగా ఎదురుచూపులు
ఒకటా, రెండా పదిహేడేళ్లకు పైగా మేము ఐఈఆర్‌టీలుగా పనిచేస్తూనే ఉన్నాం. భద్రత లేని ఉద్యోగాలు చేస్తున్నాం. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నా.. ఎప్పటికైనా రెగ్యులర్‌ కాలేకపోతామా? స్కూల్‌ అసిస్టెంట్‌లు కాలేకపోతామా? డీఎస్సీ ద్వారా అవకాశాలు రావా? అని ఎదురు చూశాం. ఈ ఎదురుచూపుల్లోనే మా వయసు కరిగిపోయింది. అందుకే ప్రభుత్వం వెలువరించిన డీఎస్సీ – 2019లో అవకాశాల కోసం వెయిటేజీ కల్పించాలని కోరుతున్నాం.
– అరుణకుమారి, ఏపీ ఐఈఆర్‌టీ అసోసియేషన్‌ సెక్రటరీ
 

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *