విమానంలో ఉద్యోగినిపై పైలట్‌ లైంగిక వేధింపులు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: విమానంలో మహిళా ఉద్యోగిపై పైలట్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాక్‌పిట్‌లోకి వేడి నీళ్లు తీసుకురమ్మని చెప్పి.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన బెంగళూరు-అమృత్‌సర్‌-శ్రీనగర్‌-ఢిల్లీ విమానంలో ఈ నెల 16వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాక్‌పిట్‌లోకి వేడి నీళ్లు తీసుకురమ్మని కో పైలట్‌ చెప్పడంతో తాను వెళ్లానని, అదే సమయంలో కో పైలట్‌ వాష్‌రూమ్‌లోకి వెళ్లగా.. పైలట్‌ వచ్చి తనకు దగ్గరగా వచ్చి సెల్ఫీ దిగాల్సిందిగా కోరాడని, తాను నిరాకరించడంతో వేధించాడని పేర్కొంది.
 
వెంటనే తాను బయటికి వచ్చానని, అయితే అమృత్‌సర్‌లో విమానం ల్యాండయ్యాక.. అతడు తన వద్దకు వచ్చి ఫోన్‌ నంబర్‌ అడిగాడని తెలిపింది. ప్రతి ల్యాండింగ్‌ సందర్భంలోనూ వేధిస్తూ వచ్చాడని, ఢిల్లీలో చివరి ల్యాండింగ్‌ సమయంలో కౌగిలించుకునేందుకు యత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు.. పైలట్‌పై కేసు నమోదు చేశారు. దీంతో అతడు ఈ నెల 24న ముందస్తు బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు అందుకు నిరాకరించింది. మరోవైపు.. పోలీసు దర్యాప్తు పూర్తయ్యాక పైలట్‌పై సంస్థ పరంగా చర్యలు తీసుకుంటామని ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *