వేజండ్ల ఘటనపై విచారణకు కమిటీ


గుంటూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా వేజండ్ల రైల్వేస్టేషన్‌లో జరిగిన అసాధారణ దుర్ఘటనపై రైల్వేశాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. జోనల్‌ స్థాయిలో విధులు నిర్వహించే ఐదుగురు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఎంజీ శేఖరం ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా చీఫ్‌ ఎలక్ట్రికల్‌ సర్వీసెస్‌ ఇంజనీర్‌ ఎం రాజమురుగన్‌, చీఫ్‌ రోలింగ్‌ స్టాక్‌ ఇంజనీర్‌ ఆర్‌వీఎన్‌ శర్మ, చీఫ్‌ సిగ్నల్‌ ఇంజనీర్‌ ఏకే సంఘీ, చీఫ్‌ ఇంజనీర్‌(ప్లానింగ్‌ అండ్‌ డిజైన్స్‌) జీ బ్రహ్మానందరెడ్డి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ ఐదుగురుతో కూడిన కమిటీ సోమవారం గుంటూరు రానుంది.
 
కమిటీ తొలుత ప్రమాదానికి గురైన గుంటూరు – ఒంగోలు ప్యాసింజర్‌ రైలు బోగీలను తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత వేజండ్ల రైల్వేస్టేషన్‌ని సందర్శిస్తుంది. అలానే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులని పరామర్శించనుంది. అనంతరం పట్టాభిపురంలోని రైల్‌వికాస్‌ భవన్‌లో విచారణ జరిపి రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యాకు నివేదిక అందజేస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపడతారని సమాచారం. శనివారం ఉదయం అసాధారణరీతిలో రైలులో ప్రయాణిస్తోన్న ప్రయాణీకులు విద్యుత్‌ షాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ఒకటో నెంబరు లూప్‌లైన్‌కు ఎర్త్‌ బాండింగ్స్‌ లేకపోవడమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *