'వైసీపీలో టాప్ నిర్మాతలు ఉంటే.. టీడీపీలో టాప్ డైరెక్టర్ ఉన్నారు'


లోబడ్జెట్ సినిమా అయినా.. దర్శకత్వం బాగుంటే అది హిట్ అవుతుంది. నిర్మాత దండిగా డబ్బు ఖర్చుపెట్టినప్పటికీ.. డైరెక్టర్ బలహీనుడైతే ఆ సినిమా ఫట్ అవుతుంది. ఏపీ రాజకీయాల్లో కూడా సరిగ్గా ఇదే జరిగిందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. సదరు మంత్రివర్యుడు స్వయంగా ముఖ్యమంత్రికే ఈ డైరెక్షన్ సంగతులు చెబితే ఆయన ఆసక్తిగా ఆలకించారు. ఇంతకీ పాలిటిక్స్‌లో ఈ డైరెక్షన్ గోల ఏమిటీ అనుకుంటున్నారా? వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
   ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కీ, కౌంటింగ్‌కీ మధ్య 43 రోజుల గ్యాప్‌ ఉండటంతో రాజకీయ నేతలు కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా కూడికలు, తీసివేతలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇదిలా ఉంటే… వేసవి విడిదికి వెళ్లొచ్చిన సీఎం చంద్రబాబుని పలువురు నేతలు కలుసుకుంటున్నారు. ఇటీవల తన వద్దకి వచ్చిన ముగ్గురు మంత్రులతో చంద్రబాబు సుమారు గంటన్నరసేపు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా చంద్రబాబు చెబుతున్న లెక్కలు విని సదరు మంత్రులు ఆశ్చర్యపోయారు. తన ఎదురుగా కూర్చున్న ఓ మంత్రి పోటీచేసిన నియోజకవర్గంలోని పరిస్థితిని చంద్రబాబు గ్రామాలవారీగా లెక్కలతో సహా వివరించడంతో ఆయన అవాక్కయ్యారు. “నీవు గెలుస్తున్నావు. కానీ కొన్ని గ్రామాల్లో ఇంకా బాగా వర్కవుట్ చేసుకుని ఉండాల్సింది” అని చంద్రబాబు చెప్పారు. దీంతో ఈ వివరాలన్నీ మీకెలా తెలిశాయని ఆ మంత్రివర్యుడు అమాయకంగా ప్రశ్నించారు. “నా దగ్గర సమాచారమంతా ఉంది..” అని చంద్రబాబు బదులిచ్చారు. అంతేకాదు- ఆ జిల్లాకు చెందిన మిగతా నియోజకవర్గాల లెక్కలు కూడా సీఎం విశదీకరించారు.
 
   చంద్రబాబును కలిసిన మంత్రుల బృందంలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆదినారాయణరెడ్డి కూడా ఉన్నారు. ఆయన తమ జిల్లాలో పరిస్థితి గురించి వివరించారు. ఈ సందర్భంగా మరో నేత మాట్లాడుతూ.. “ఈ ఎన్నికల్లో వైసీపీ బాగా డబ్బులు కుమ్మరించింది, ఒక్కో నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల వరకు నగదు పంపిణీ చేశారు” అని సీఎంకు చెప్పుకొచ్చారు. డబ్బుల విషయంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వెనుకబడిందని అన్నారు. దీనిపై ఆదినారాయణరెడ్డి కల్పించుకుని “వైసీపీలో మంచి నిర్మాతలే ఉన్నారు, కానీ జగన్ డైరెక్షనే బాలేదు. అందువల్లే ఆ సినిమా ఈ ఎన్నికల్లో ఫట్ అవుతుంది” అని తేల్చేశారు. “తెలుగుదేశంలో నిర్మాతలు తక్కువే అయినప్పటికీ, డైరెక్టర్ చంద్రబాబు కావడం కలిసొచ్చింది. లోబడ్జెట్ సినిమా అయినా డైరెక్షన్ బాగుండటంతో హిట్ కొట్టబోతుంది” అని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఆది చేసిన ఈ విశ్లేషణ పట్ల చంద్రబాబు కూడా ఆసక్తి కనబరిచారు.
 
   మిగతా ఇద్దరు మంత్రులు చంద్రబాబుతో సంభాషిస్తూ “మీకు బూత్‌ల వారీగా లెక్కలు ఎలా వచ్చాయి?” అని మరోసారి కుతూహలంతో అడిగారు. ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ గురించి కూడా ప్రశ్నించారు. తాను అవన్నీ చేయించాననీ, తెలుగుదేశం నూటికి వెయ్యి శాతం మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందనీ, ఇందులో ఎవరికీ సందేహం అక్కర్లేదనీ” బాబు మరోసారి వారికి స్పష్టంచేశారు. తనవద్ద అన్ని సర్వేల వివరాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఏదిఏమైనా పాలిటిక్స్‌లో “డైరెక్షన్‌” గురించి ఆదినారాయణ చేసిన విశ్లేషణ తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడు ఆసక్తికర చర్చలకి దారితీస్తోంది.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *