శరద్ పవార్‌కే తెలియకపోతే, ఇమ్రాన్‌ ఖాన్‌కి ఏం తెలుస్తుంది? : మోదీ


అహ్మదాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఒకేసారి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌లపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాలాకోట్ దాడులను ప్రస్తావిస్తూ మోదీ ఏం చేస్తారో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌కే తెలియకపోతే, ఇక పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఎలా అంచనా వేస్తారు? అని మోదీ అన్నారు.
 
గుజరాత్‌లోని పటన్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ భూమి పుత్రునికే ఓటు వేయాలని ఓటర్లను కోరారు. సొంత మనిషినే గెలిపించాలని కోరారు. తాను ఉత్తర గుజరాత్‌లో పుట్టి, పెరిగానన్నారు. ఇక్కడి ‘రాణి ని వవ్’ కరెన్సీ నోటుపై దర్శనమిస్తోందని, ప్రపంచ వారసత్వ సంపదగా మారిందని చెప్పారు. ఇదంతా ఎందుకు, ఎలా జరిగిందో తెలుసా? అని అడిగారు. ‘‘మీరంతా మీ భూమి పుత్రుడిని ఢిల్లీకి పంపించారు కాబట్టి’’ అని తెలిపారు.
 
మోదీ ఉత్తర గుజరాత్‌లోని వాద్ నగర్‌లో జన్మించిన సంగతి తెలిసిందే. ‘‘మీరంతా నా గురువులు, నా పెద్దలు, నా చిన్ననాటి మిత్రులు. మీ ఆశీర్వాదాల కోసం నేను ఇక్కడికి వచ్చాను’’ అని చెప్పారు. ఈ దేశంలో సహజ వనరులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని, తాను మాత్రం దేశంలో అణగారిన వర్గాలకు మాత్రమే సహజ వనరులపై మొదటి హక్కు ఉందని చెప్తున్నానని తెలిపారు.
 
ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ శనివారం బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ అంటే తనకు భయంగా ఉందన్నారు. మోదీ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదన్నారు.
 
ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయు సేన దాడి చేసిన సంగతి తెలిసిందే.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *