శశికళ పదవిలో ఇక దినకరన్‌


  • ఏఎంఎంకే ప్రధానకార్యదర్శిగా టీటీవీ ఏకగ్రీవం
చెన్నై, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి శశికళ పదవిని ఆమె సోదరి కుమారుడు, ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ చేజిక్కించుకున్నారు. చెన్నై కేకేనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యనిర్వాహకుల సమావేశంలో దినకరన్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్నిచోట్లా పోటీ చేసిన ఏఎంఎంకేను రాజకీయ పార్టీగా గుర్తించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయాలని కూడా ఈ సమావేశంలో తీర్మానం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి కుక్కర్‌ గుర్తు కేటాయించాలని కోరగా, రాజకీయ పార్టీగా గుర్తించాలని ఆ పార్టీ ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదంటూ ఎన్నికల సంఘం తిరస్కరించిన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలోనే ఏఎంఎంకేకు రాజకీయ పార్టీ గుర్తింపు సాధించే దిశగా లోక్‌సభ ఎన్నికల్లో పది శాతానికిపైగా ఓట్లు దక్కే అవకాశం ఉందని భావించి, పార్టీ పగ్గాలను దినకరన్‌ చేపట్టినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఈసీకి దరఖాస్తు చేయబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ పరిస్థితి ఏమిటని ఆ పార్టీ అధికార ప్రతినిధి, నటి సీఆర్‌ సరస్వతిని విలేకరులు ప్రశ్నించగా, జైలు నుంచి విడుదలైన తర్వాత శశికళ మళ్లీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపడతారని చెప్పారు. మాతృ సంస్థ అన్నాడీఎంకేలో ఏఎంఎంకే విలీనమయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించగా, ఈ విషయమై దినకరన్‌ నిర్ణయం తీసుకుంటారని బదులిచ్చారు.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *