శ్రీకాకుళంలో వైసీపీ నేతల మోనం.. కారణం ఇదేనా?


ఆ జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఒక్కసారిగా జోష్ పెరగటానికి కారణమేంటి? పోలింగ్ తర్వాత గెలుపు తమదేనని బాకాలూదిన ప్రధాన ప్రతిపక్షం ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యింది? ఓటర్ల నాడి పట్టుకోవటం అంత సులువు కాదన్న విషయం ఏ పార్టీ నేతలకు అర్ధమయ్యింది? శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ అనంతరం జరుగుతున్న చర్చలపై ప్రత్యేక కథనం మీకోసం!
 
    ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. తమ అభిమానం చూరగొన్న నాయకుడిని భుజాన వేసుకోవటం ఇక్కడి ప్రజలకు అలవాటు. ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లా వాసులు ఒక అడుగు ముందే ఉంటారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు అడిగే నేతల ఆటలు సిక్కోలులో సాగవు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సిక్కోలు వాసులు ఆ పార్టీ జెండాను మోస్తూనే ఉన్నారు. బీసీలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో ఆదినుంచీ టీడీపీ తన ప్రాభవాన్ని నిలుపుకుంటూ వస్తోంది.
 
    అభివృద్ధి మాట అటుంచితే.. శ్రీకాకుళం జిల్లా పట్ల రాజకీయ పార్టీల్లో ఓ సెంటిమెంట్ బలంగా ఉంది. రాష్ట్రానికి ఈశాన్యంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ మెజారిటీ సీట్లు గెలిస్తే, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నదే రాజకీయ పార్టీల అభిప్రాయం. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు శ్రీకాకుళం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాయి. నువ్వా- నేనా అన్నట్టు ప్రచారాలు నిర్వహించాయి.
 
   అయితే పోలింగ్ ముగిసిన మర్నాటి నుంచి జిల్లాలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొన్నది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు ఫలితాలతో పనిలేద్నట్టుగా వ్యవహరించారు. ఎన్నికల్లో మేమే గెలిచేశాం అన్నంతగా హడావిడి మొదలెట్టేశారు. బెట్టింగుల పేరుతో నానా హంగామా చేశారు. దీంతో ఒకానొక దశలో టీడీపీ నేతలకు సైతం నిజమేనా అన్న సందేహాలు ఏర్పడ్డాయి. అయితే గత వారం రోజులుగా జిల్లా రాజకీయ వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. వైసీసీ నేతలు తొలుత ప్రదర్శించిన ఈ అత్యుత్సాహం ఇప్పుడు కనబరచకపోవడం గమనార్హం!
 
   పోలింగ్‌ ముగిశాక అన్ని పార్టీలు బూత్‌ల వారీగా పడిన ఓట్ల గురించి సమాచారం సేకరించాయి. వాటిపై విశ్లేషణలు కూడా చేసుకున్నాయి. ఈ పరిణామం తర్వాత వైసీపీ నేతల బాగా చప్పబడిపోయారని లోకల్‌ టాక్‌! “మా గెలుపుపై బెట్టింగులు కాద్దాం రండి..” అంటూ మొదట్లో సవాళ్లు విసిరిన నేతలు ఇప్పుడు ముఖాలు చాటేస్తున్నారట. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో సైతం కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయట. క్షేత్రస్థాయి పరిస్ధితులను భేరీజు వేసుకున్నాక వైసీపీ నేతలకు అసలు తత్వం బోధపడినట్టుంది అని జిల్లా తెలుగుదేశం నేతలు ఇప్పుడు సెటైర్లు పేలుస్తున్నారు.
 
   శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014 ఎన్నికల్లో పదింట ఏడు స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఈ దఫా ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో పాగా వేస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. వైసీపీ చేస్తున్న గ్లోబల్ ప్రచారాలు తమ గెలుపుని ఆపలేవని వారు కుండ బద్దలు కొడుతున్నారట. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలను రప్పించుకుని పరిశీలించిన మీదట ఈసారి జిల్లాలో వార్ వన్ సైడ్ అంటూ విక్టరీ సింబల్ చూపిస్తున్నారట టీడీపీ పెద్దలు. పోలింగ్ అనంతరం కాస్త సైలెంటుగా కనిపించిన అధికారపక్ష నేతలు ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలయ్యిందట.
 
   మొన్నటి పోలింగ్‌ సమయంలో రాష్ట్రంలో మిగతా చోట్ల మాదిరే శ్రీకాకుళం జిల్లాలోనూ ఈవీఎంలు మొరాయించాయి. అనేక చోట్ల మధ్యాహ్నం వరకూ పోలింగ్ ప్రారంభం కాలేదు. అయినా అర్ధరాత్రి వరకూ వృద్ధులు, మహిళలు క్యూలలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ పరిణామం టీడీపీకే అనుకూలం అని జిల్లా నేతలు అంచనాలు వేస్తున్నారు. దీనికి తోడు తితలీ తుఫాను సమయంలో చంద్రబాబు సహా మంత్రులంతా పది రోజులపాటు జిల్లాలోనే మకాం వేశారు. పరిస్ధితిని చక్కదిద్దారు. విపత్తుల సమయంలో ఏరియల్ సర్వేలతో సరిపెట్టుకునే ముఖ్యమంత్రులున్న కాలం ఇది. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోనే మకాం వేయడం ప్రజల్లో బాగా ముద్రపడిపోయింది. ఈ అంశం ఓటర్ల విజ్ఞతను మేలుకొలిపి ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో సిక్కోలు ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియాలంటే ఫలితాల వరకూ వెయిట్ చేయాల్సిందే!

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *